22 July, 2026 | 9:48 PM

పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాం.. రోగాలను తరిమికొడదాం

22-07-2026 08:40 PM

మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధులను తరిమికొట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ వార్డులో బుధవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ సందర్భంగా వారు వార్డులో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలం, ఇతర సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తగా పట్టణంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. డ్రెయిన్లలో చెత్తాచెదారం నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, క్రమం తప్పకుండా బ్లీచింగ్ పౌడర్ పిచికారీతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకే అందజేయాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్‌ను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.