రికార్డు వేగంతో రైతుభరోసా
20-06-2025 12:55 AM
- నాలుగు రోజుల్లోనే రూ.6,405కోట్లు విడుదల
- -- 62.47లక్షల ఖాతాల్లో నిధుల జమ
- నాలుగో రోజు 5 ఎకరాల వరకు.. రూ.1,189.43 కోట్లు విడుదల
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంట పెట్టుబడి సాయంగా రైతుభరోసాను రికార్డు వేగంతో ఖాతాల్లో జమ చేస్తోంది. తొమ్మిది రోజుల్లో రూ. 9వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన మేరకు ఆర్థికశాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తోంది. వ్యవసాయశాఖ అందించిన జాబితా మేరకు రైతుల ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమచేస్తోంది.
గురువారం ఐదు ఎకరాల్లోపు భూములున్న 4,43,167మంది రైతులకు రైతుల ఖాతాల్లో రూ. 1,189.43 కోట్లు జమ చేసింది. ఇప్పటివరకు 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6,404.7 కోట్లను ప్రభుత్వం జమచేసింది. భూమి పరంగా చూసుకుంటే 106 లక్షల ఎకరాలకు పంట సహాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.







