1 April, 2026 | 3:03 PM

కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా

15-05-2024 02:30 AM

యాదాద్రి భువనగిరి, మే 14 (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయితున్నా.. కొనుగోళ్లు జరుపకుండా అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. పంట చేతికి వచ్చి నెలలు గడుస్తున్నా ముంచుకొస్తున్న అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసి పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ధాన్యం బస్తాలతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. భువనగిరి మండలం సూరేపల్లి తండాకు చెందిన రైతులు నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసినప్పటికీ తూకం వేయక, తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ధాన్యం కొనుగోళ్లకు చర్యలు చేపడుతామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్య క్రమంలో రైతులు కేతావత్ సుధాకర్ నాయ క్, శ్రీనివాస్, లక్ష్మణ్, ఉమ్లా నాయక్, రవీందర్, దేవేందర్, సాగర్, శాంతమ్మ, పద్మ, సుగుణ, సుజాత పాల్గొన్నారు.