1 April, 2026 | 1:13 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ఫుల్లుగా తాగేశారు

15-05-2024 02:30 AM

ఎన్నికల వేళ జోరుగా మద్యం అమ్మకాలు

గతం కంటే పెరిగిన బీర్లు, లిక్కర్ అమ్మకం

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి): రెండు నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకం జోరుగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు తోడు మండుతున్న ఎండలతో బీర్లు, లిక్కర్ అమ్మకం గతం కంటే పెరిగింది. 2023 ఏప్రిల్, మే కంటే  ఈ ఏడాది మద్యం అమ్మకం ఎక్కువగా జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

ఎన్నికల వేళ మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఎక్సైజ్ శాఖ నిఘా ఉంచినప్పటికీ అక్రమ మార్గాల ద్వారా పలువురు పక్క రాష్ట్రాల నుంచి తెప్పించి మద్యాన్ని ఏరులుగా పారించారనే ఆరోపణలున్నాయి. రెండు నెలలుగా రూ. 3.61 కోట్ల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడం ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఉంది. ఇక అధికారుల దృష్టి పడకుండా, లెక్కలోకి రాకుండా మందుబాబులకు ఎంత మొత్తంలో మద్యం చేరి ఉంటుందో మనం ఊహించవచ్చు. దీంతో  మందు బాబులు ఫుల్లుగా తాగారని తెలుస్తోంది. 

37 రోజులు.. 57.19 లక్షల కేసుల బీర్లు 

రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి మే 7 వరకు 37 రోజులలోనే 57.19 లక్షల కేసుల బీర్లు అమ్మకం జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కలిపి 86.32 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ సంవత్సరం మే మొద టి వారం నాటికే బీర్ల అమ్మకం 60 లక్షలకు చేరువ కాగా, మే చివరి నాటికి గత ఏడాది కంటే ఎక్కువగా అమ్మకమయ్యే అవకాశం ఉంది.

వేసవి సందర్భంగా లిక్కర్ అమ్మకాలు అంతంతే ఉన్నట్లు తెలిసింది. ప్రతి నెలలో 30 లక్షల కేసుల లిక్కర్ అమ్మకం జరుగుతున్నట్లు, శీతాకాలంతో పోల్చితే వేసవిలో లిక్కర్ అమ్మకం తక్కువేనని తెలిసింది. రాష్ట్రంలో ప్రతినెల 30 లక్షల కేసుల లిక్కర్, 50 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఇవి సరిపోకపోతే ఎక్సైజ్‌శాఖ పక్క రాష్ట్రాల నుం చి మద్యాన్ని దిగుమతి చేసుకుంటుంది.

ఏరులై పారిన నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం..

ఎన్నికలలో మద్యం ప్రవాహాన్ని నివారించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకున్నప్పటికీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి పలువురు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలో మద్యం కొరత ఉంటుందని భావించి పక్క రాష్ట్రాల నుంచి పలువురు నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని భారీగానే దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. రెండు నెలలుగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు జరిపిన దాడుల్లో రూ.3.61 కోట్ల విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.