ఏపీలో కొనసాగుతున్న ఘర్షణలు
తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
కారంపూడి టీడీపీ కార్యాలయానికి నిప్పు
తాడిపత్రిలో సూర్యముని ఇంటిపై రాళ్లదాడి
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఏపీ లో పోలింగ్ ముగిసినా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. పోలింగ్ రోజు జరిగిన దాడులకు ప్రతీకారంగా అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయారు. చంద్రగిరిలో కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం దాడి జరిగింది. తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో భద్రతా సిబ్బందికి గాయాలు కాగా, కారు ధ్వంసమైంది. నడ వలూరు సర్పంచి గణపతి ఆధ్వర్యంలో 150 మంది రాడ్లు, కత్తులతో దాడి చేశారని, దీన్ని చెవిరెడ్డి పిరికిచర్యగా టీడీపీ ఆరోపించింది.
కారంపూడిలో దాడులు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పేట సన్నెగండ్లకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తుండగా కారంపూడిలో ఆగారు. ఈ క్రమంలో ఒకసారిగా ఆయన అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. రోడ్డు పక్కనే ఉన్న జానీపాషా వాహనానికి నిప్పు పెట్టారు. దాడులు ఆపేందుకు యత్నించిన సీఐ నారాయణస్వామిపైనా దాడి చేశారు. చిరువ్యాపారి పున్నమ్మ తోపుడు బండిని సైతం మూకలు ధ్వంసం చేశారు. కాగా, అనంతపురం తాడిపత్రిలో టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్లతో దాడికి దిగడంతో ఆ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టారు. మూకల దాడిలో సీఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి. దాడులపై ఫిర్యా దు చేయడానికి కార్యకర్తలతో వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
శ్రీకాళహస్తిలో గర్భిణిపై దాడి
నియోజకవర్గంలోని తెల్లకూరులో గర్భిణి అరుణపై జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెలో రామెగౌడకు చెందిన డ్రిప్ పరిక రాలకు నిప్పు పెట్టారు. తాను టీడీపీకి మద్ద తు పలికినందుకే తన ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా యర్రగొం డపాలెం మండలం వాదంపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీళ్లు పట్టుకునే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిం ది. గ్రామంలో టీడీపీ వర్గీయులు నీటి ట్యాంకర్లను ఆపేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల రం గంప్రవేశం చేసి రాజీకి ఒప్పించారు.




