8 May, 2026 | 2:00 AM

ఆయిల్‌పామ్ సాగు.. లాభాలు బాగు..

08-05-2026 12:06 AM
  1. నర్మేట ఫ్యాక్టరీలో రికార్డు స్థాయి ఉత్పత్తి
  2. ధరల జోరు.. టన్నుకు రూ.23,501లు

నంగునూరు, మే 7 : నలభై ఏళ్ల వరి సాగులో లభించనీ భరోసా.. మూడేళ్ల ఆయిల్ పామ్ సాగులో కనిపిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతును పసిడి గెల గట్టెక్కిస్తోంది.ఇది నేడు సిద్దిపేట జిల్లా నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సాక్షిగా మారుతున్న గ్రామీణ ఆర్థిక చిత్రపటం. ఒకప్పుడు పెట్టుబడులు రాక, అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని ఆవేదన చెందిన రైతన్న,నేడు ఆయిల్ పామ్ సాగుతో ధీమాగా ముందడుగు వేస్తున్నాడు.

అంచనాలను మించిన ఉత్పత్తి..

ప్రారంభంలో ఈ ఫ్యాక్టరీ పనితీరుపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ,అధికారులు అద్భుతమైన ఫలితాలను సాధించారు.ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి ఉత్పత్తి నమోదైంది.ఈ ఒక్క నెలలోనే 10,130.000 మెట్రిక్ టన్నుల గెలలను (ఎఫ్ ఎఫ్ బి) ప్రాసెసింగ్ చేసి, 1,845.646 మెట్రిక్ టన్నుల ముడి నూనెను ఉత్పత్తి చేశారు. 875 మెట్రిక్ టన్నుల పామ్ గింజలను ప్రాసెసింగ్ చేయగా 145.450 మెట్రిక్ టన్నుల నూనె లభించింది.నూనె తీయగా వచ్చిన వ్యర్థాలతో 1.2 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఫ్యాక్టరీ అవసరాలకు వాడుకోవడం ఇక్కడి మరో ప్రత్యేకత.

మార్కెట్ రికార్డు టన్ను ధర రూ.23,501లు..

రైతులకు అత్యంత సంతోషాన్నిచ్చే అంశం గెలల ధర. అంతర్జాతీయ మార్కెట్ అనుసరించి ఆయిల్ ఫెడ్ ప్రకటించిన తాజా ధరలు రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మార్చి నెలలో రూ. 23,005 ఉన్న టన్ను ధర, ఏప్రిల్ నెలలో రూ. 23,501 కు పెరిగింది.అంటే టన్నుకు రూ. 496 అదనంగా లభిస్తోంది.పంట అమ్మిన మూడు రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్ర పర్యటనతోనే సాగుపై ధీమా..

మొదట్లో ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ వేయాలంటే భయం వేసింది.కానీ,ఎమ్మెల్యే హరీశ్ రావు కృషితో ఖమ్మంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోటను చూశాక ధైర్యం వచ్చింది.మొదట 4 ఎకరాల్లో వేస్తే తొలి ఏడాది 19 టన్నుల దిగుబడితో రూ.3.60 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో మరో 2 ఎకరాలు పెంచాను. మొదటి మూడేళ్లు ఓపిక పడితే ఆయిల్ పామ్ ద్వారా ఏళ్ల తరబడి మంచి లాభాలు పొందవచ్చు.    

 బద్దిపడగ కిష్టారెడ్డి, రైతు, అక్కెనపల్లి

అధికారుల విన్నపం..

సిబ్బంది అంకితభావం తో నెల రోజుల్లోనే రికార్డు ఉత్పత్తి సా ధించాం. రోజుకు 600 మెట్రిక్ టన్నుల ఆయిల్ ప్రాసెసింగ్ జరుగుతోంది.గెలల రాక ఇంకా పెరిగితే పూర్తి సామర్థ్యంతో పని చేసేం దుకు సిద్ధంగా ఉన్నాం.

 ప్రణీష్ గౌడ్,  ఫ్యాక్టరీ డిప్యూటీ మేనేజర్