25 May, 2026 | 10:26 PM

చిరు జల్లులు.. తడిసి ముద్దయిన ధాన్యం!

25-05-2026 09:56 PM

సిద్ధన్నపేట మార్కెట్ యార్డులో నిలిచిన నీరు..రైతుల ఆందోళన

నంగునూరు: సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట మార్కెట్ యార్డులో సోమవారం సాయంత్రం కురిసిన చిరు జల్లులకే ధాన్యం తడిసి ముద్దయింది. యార్డులో కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో రైతులు తెచ్చిన వడ్ల రాశులు కొండల్లా పేరుకుపోయాయి. దీనికి తోడు మొక్కజొన్న కుప్పలు కూడా తోడవడంతో యార్డులో సందు లేకుండా పోయింది.​

ఈ క్రమంలో కురిసిన స్వల్ప వర్షానికి కుప్పల మధ్య నీరు నిలిచి ధాన్యం నీట మునిగింది. చిన్నపాటి జల్లులకే పరిస్థితి ఇలా ఉంటే, భారీ వర్షం కురిస్తే పంట కొట్టుకుపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ముదరక ముందే అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.