11/6 కెనాల్ కోసం రైతుల దీక్ష
- పెద్ద లింగాపూర్ సబ్‌ష్టేషన్ ఎదుట నిర్వహణ
మార్చి 4న హాజరై, మద్దతు ఇస్తానన్న తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మాన కొండూరు, సిరిసిల్ల నియోజకవర్గాలకు చెందిన 12 గ్రామాల ప్రజలు శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను వివరించారు. కాళేశ్వరం ప్యాకేజీ పరిధిలోని 11/6 కెనాల్ పనులు అసంపూర్తిగా వదిలేయడం వల్ల 12 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు తెలిపారు. ఈ కెనాల్ పూర్తి అయితే దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రస్తుతం నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ఈ సమస్యపై గతంలో దాదాపు 19 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష నిర్వహించగా, చివరి రోజు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు వచ్చి 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు కెనాల్ పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మళ్లీ పెద్ద లింగాపూర్ సబ్స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని, తమ దీక్షకు మద్దతుగా రావాలని తీన్మార్ మల్లన్నను కోరారు. స్పందించిన తీన్మార్ మల్లన్న.. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని, మార్చి 4న దీక్షా శిబిరానికి స్వయంగా హాజరై రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని హామీ ఇచ్చారు.
నేడు ఖమ్మం జిల్లాకు తీన్మార్ మల్లన్న
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై బాధితు లను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి పూర్తి న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇవ్వనున్నారు.




