20-02-2026 04:13:07 PM
- తమ వద్ద స్మార్ట్ ఫోన్స్ లేవని ఆన్‌లైన్ విధానంపై ఆగ్రహం
- పాస్‌బుక్ పద్ధతినే అమలు చేయాలని డిమాండ్
పెద్ద కొత్తపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయం ముందు శుక్రవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సొసైటీకి శుక్రవారం ఉదయం 900 బస్తాల యూరియా వచ్చిందన్న సమాచారం తెలిసి రైతులు భారీగా కార్యాలయానికి తరలివచ్చారు. అయితే యూరియా పంపిణీకి ఆన్‌లైన్ యాప్ ద్వారా నమోదు తప్పనిసరి చేయడంతో తమ వద్ద స్మార్ట్ ఫోన్స్ లేవని బుకింక్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, నెట్ సమస్యలు ఉండడం వల్ల నమోదు ప్రక్రియ కష్టంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం పాత విధానం ప్రకారం పాస్‌బుక్ ఆధారంగా రైతులకు యథావిధిగా సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సతీష్ వెంటనే సొసైటీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. వారి డిమాండ్లను విని, సమస్యను సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు.