10 August, 2026 | 8:42 PM

రైతులు డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి

10-08-2026 07:34 PM

- మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఉమర్ 

బేల,(విజయక్రాంతి): రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బేల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ఉమర్ సూచించారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 'ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్' (Framework for Fertilizer) మొబైల్ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను ముందుగానే బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. సోమవారం బేల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు యాప్ పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌లో ఎరువులకు అధిక డిమాండ్ ఉండటంతో కొన్నిచోట్ల రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ఈ యాప్‌ను వినియోగించాలని ఆయన సూచించారు. యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు తదితర వాటి లభ్యతను సమీప ఎరువుల దుకాణాల్లో తెలుసుకోవడంతో పాటు ముందస్తుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందని వివరించారు.

రైతులు తమ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, భూమి వివరాలతో యాప్‌లో నమోదు చేసుకుని సులభంగా ఎరువులను బుక్ చేసుకోవచ్చన్నారు. దీంతో ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండదని, సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు.అలాగే రైతులు ఎరువులను అవసరానికి మించి కొనుగోలు చేయకుండా, వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులోనే వినియోగించాలని సూచించారు.

నాణ్యమైన ఎరువులను మాత్రమే గుర్తింపు పొందిన ఎరువుల విక్రయ కేంద్రాల నుంచి కొనుగోలు చేయాలని, కొనుగోలు అనంతరం తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని చెప్పారు. ఎరువుల లభ్యత, బుకింగ్ లేదా ఇతర వ్యవసాయ సేవలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే మండల వ్యవసాయ కార్యాలయాన్ని లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారీ సాయి, తదితరులు పాల్గొన్నారు.