వరుణ యాగంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
ఆలేరు,(విజయక్రాంతి): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో వరుణ యాగం నిర్వహించారు. యాగంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పూల బొకే అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో వరుణ యాగం నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా–గోదావరి నదుల్లో నీటి వనరులు పుష్కలంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.






