5 May, 2026 | 3:36 AM

ఆర్గానిక్ పంటల సాగుపై రైతులు ద్రుష్టి సారించాలి

05-05-2026 02:15 AM

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వచ్చే పంటలు పండించాలి.. 

రైతన్నల ఖాతాల్లో ఒక లక్షా 40 వేల కోట్లు రూపాయలు జమ..

రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తాండూరు, మే 4, (విజయక్రాంతి): సేంద్రియ ఎరువులు వినియోగించి ఆర్గానిక్ పంటలు సాగు చేసేందుకు రైతన్నలు ముందుకు రావాలని... తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలను దిగుబడి చేసుకోవాలని... రాష్ట్రంలో ఉన్న రైతన్నల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష 40 వేల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ లో 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భూములను రక్షించి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.సైంటిస్ట్ లు భూమిని ఎ రకంగా సంరక్షించు కోవాలో  అవగాహనా కలిపిస్తారని తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయుటకు ఒక లక్షా 40 వేల కోట్లు రైతుల ఖాతాల లో  రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి ప్రయత్నంతో 90 కోట్ల మంజూరుతో కోట్ పల్లి ప్రాజెక్టు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని దీంతో తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు, దేశం లో అత్యధిక పంటలు పండించే  రైతులు తెలంగాణ రైతు లేనని,  ప్రభుత్వం ఎక్కువ మొత్తం లో వరి కొనుగోలు చేస్తుందని అన్నారు. నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి  వ్యవసాయం, పై అవగాహనా కలిపించు కోవాలన్నారు. ప్రకృతి పంటలు పండించిన లావణ్య రెడ్డి తో కలిసి టి జి ఆన్లైన్ యాప్ ను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ, మత్స్య శాఖ వివిధ శాఖ లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజు,రైతు దేశానికి వెన్నెముక వంటి వాడు, వ్యవసాయం దండగ కాదు,, వ్యవసాయం ఒక పండుగ, మంత్రి  చొరవ తో వ్యవసాయ రంగాన్నే ముందుకు  తీసుకెళ్తున్నమ్మన్నారు, అయిల్ ఫామ్ కంపెనీ జిల్లా కు మంజూరు తో పాటు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం 14 వేల కోట్లు సైతం మంజూరు అయ్యాయని తెలిపారు. వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్మన్ నీరజ, మార్కెట్ చైర్మన్ లు,ఎ ఎం సి చైర్మన్ లు, ఆత్మ చైర్మన్ లు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రజా ప్రతి నిధులు, రైతులు పాల్గొన్నారు.