7 May, 2026 | 1:35 AM

రైతులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

07-05-2026 01:03 AM

కలెక్టర్ హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే6 (విజయక్రాంతి): సిర్పూర్ (టి) మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపల చెరువు పనులను పరిశీలించిన కలెక్టర్ హరిత రైతులు ఈ పథకం ద్వారా భూములను సారవంతం చేసుకోవడంతో పాటు ఫిష్ పాండ్ల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకోవాలని, పని ప్రదేశాల్లో త్రాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పెద్దబండ చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, యాసంగి వరి కొనుగోలు నేపథ్యంలో అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. మత్తు పదార్థాలు, నిషేధిత పత్తి విత్తనాల రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

చింతలమానపల్లి మండలం గంగాపూర్ గ్రామంలోని బాబాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఎండదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఆలస్యంగా విధులకు హాజరయ్యే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం దిందా గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిని పరిశీలించిన కలెక్టర్, హై లెవెల్ వంతెన నిర్మాణ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ వంతెన పూర్తయితే గ్రామస్తుల రవాణా సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, రవాణా శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.