4 September, 2026 | 6:09 AM

నీళ్లులేక రైతుల గోస.. ఖాళీగా మారిన ఎస్సారెస్పీ కాలువలు

04-09-2026 | 04:30am

ముడుపుగల్ వద్ద బీ ఆర్ ఎస్ శ్రేణుల ధర్నా

మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): నీళ్లు లేక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీ ఆర్ ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. ముడుపుగల్ గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ బ్రిడ్జి సమీపంలోని ఖాళీగా ఉన్న కాలువల వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల వచ్చిన కరువు అని విమర్శించారు. కాళేశ్వరం గేట్లను సకాలంలో ఎత్తి, పంపుల ద్వారా నీటిని తరలించి చెరువులు, కుంటలను నింపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతులు సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.

ఎస్సారెస్పీ కాలువల్లో నీరు పారాల్సిన సమయంలో కాలువలు ఖాళీగా కనిపిస్తున్నాయని, దీంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. చెరువులు, కుంటలను వెంటనే నీటితో నింపి రైతులను ఆదుకోవాలని, అవసరమైన చోట సాగునీరు అందించి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బీ ఆర్ ఎస్ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని శంకర్ నాయక్ స్పష్టం చేశారు. అలాగే కేసముద్రం మండలంలో కూడా టిఆర్‌ఎస్ శ్రేణులు ఎస్ ఆర్ ఎస్ పి డిబిఎం 48 కాలువను పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు.