‘పెద్దపల్లి’ పీఠంపై ఎవరి ధీమా వారిదే!
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
లెక్కలు వేసుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఎన్నికల్లో విజేత ఎవరనే అంశపైనే అంతటా చర్చ
మంథని, మే 14 (విజయక్రాంతి): పెద్దపల్లి పార్లమెంట్ స్థానం తమదంటే.. తమ దంటూ ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు పైపైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ లోలోపల మాత్రం ఆందోళన పడుతున్నా రు. నాయకులు, కార్యకర్తల్లోనూ ఎడతెగని ఉత్కంఠ నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పగ్గాలు తీసుకున్న తర్వాత లోక్‌సభ ఎన్నికలను బీజేపీ కూడా ఎన్నికలను ప్రాధాన్యంగా తీసుకున్నది. ఈ ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్ పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ఎన్నికల ప్రచారం మాత్రం బాగానే నిర్వ హించింది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ తగ్గేదేలే.. అంటూ ప్రచారంలో దూసుకుపో యింది. మంత్రి శ్రీధర్‌బాబు కాంగ్రెస్ అభ్య ర్థి వంశీకృష్ణ తరఫున గ్రామగ్రామానికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ లోక్‌సభ స్థానంలో సోమవారం జరిగిన ఓటింగ్ కు ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చారు. మొత్తంగా 67.87 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఇక తమ ప్రధాన అనుచరులు, సీనియర్ నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఏయే ప్రాంతాల్లో ఎవరెవరికి బలం ఉంది.? ఎవరికి ఎంత మెజార్టీ రావొచ్చు అన్న అంశాలపై లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తున్నది. పోలింగ్ రోజు సైలెంట్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ ఒక లెక్క.. ఒక్క మంథని నియోజకవర్గంలో ఓటింగ్ లెక్క అని భావిస్తున్నట్లు తెలిసింది. మంత్రి శ్రీధర్‌బాబు ఇలాకాలో ఓట్లు ఎవరి కి పడతాయనేది కీలకమైన అంశంగా మారింది. ఇప్పుడు నలుగురు కలిసిన చోటా ఫలానా అభ్యర్థి బయట పడుతాడంటూ చర్చించుకుంటున్నారు.
అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఇలా..
చెన్నూరు అసెంబ్లీ స్థానంలో 227 పోలిం గ్ కేంద్రాలు ఏర్పాటు కాగా 1,93,778 ఓటర్లకు 1,32,787 మంది ఓటు వేశారు. 68.53 శాతం పోలింగ్ నమోదైంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో 227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,76,514 మంది ఓటర్ల కు 1,25,255 మంది ఓటు వేశారు. పోలింగ్ 70.96 శాతం నమోదైంది. మంచిర్యాల స్థానంలో 287 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,78,738 ఓట్లకు 1,69,591 ఓట్లు పోల్ అయ్యాయి. పోలింగ్ 60.84 శాతం నమోదైంది. ధర్మపురి స్థానంలో 269 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా 2,30, 786 ఓట్లకు 1,69,258 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ 73.34 శాతం నమోదైంది. రామగుండం స్థానంలో 260 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా 2,19,723 ఓట్లకు 1,35,330 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోలింగ్ 61 శాతం నమోదైంది. మంథని స్థానంలో 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా 2,39, 699 ఓట్లకు 1,67,750 ఓట్లు పోలయ్యా యి. పోలింగ్ 69.98 శాతం నమోదైంది. పెద్దపల్లి స్థానంలో 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా 2,57,192 ఓట్లకు 1,83,482 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ 71.34 శాతం నమోదైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను అధికా రులు కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలకు తరలించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల్లో ఎవరు విజేత అని తేలనున్నది.




