డబుల్ డిజిట్ మాదే!
9 నుంచి 13 ఎంపీ సీట్లు గెలుస్తాం
బీజేపీకి 220 మించి సీట్లు రావు
బీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేశాయి!
రేపటి నుంచి పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి సారిస్తా
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాము 9 నుంచి 13 స్థానాలు గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దీమా వ్యక్తంచేశారు. ఎన్నికలు ముగిశాయని.. బుధవారం నుంచి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహిస్తానని, ఇకపై తన దృష్టి అంతా పరిపాలనపైనే పెడతానని సీఎం అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.
ఆ అవకాశం లేదు..
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే అవకాశం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యూటీ అని ఎవరు ప్రచారం చేసినా, వానంత తెలివిలేనివాడు మరొకరు ఉండరని అన్నారు. వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీకి పనిచేశాయి..
ఆరేడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని రేవంత్ అన్నారు. ఆయా పార్టీలు ఎవరికి వారు పనిచేస్తే, అంచనా వేయడం సులువవుతుందని.. కానీ బీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం బీజేపీ కోసం పనిచేశాయని అన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో గతంకంటే ఎక్కువ పోలింగ్ నమోదయ్యిందని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 20వేల మెజార్టీతో గెలుస్తాడని రేవంత్‌రెడ్డి అన్నారు.
బీజేపీకి 220 మించి రావు
దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 220 సీట్లకు మించి రావని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్‌లో బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ వేవ్ ఏమీ లేదని వివరించారు.
సఖ్యతగా ఉంటాం..
నిన్నటితో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని, ఏపీలో ఎవరు సీఎం అయినా కలిసి పనిచేస్తామని అన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారించుకుంటామని, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుపుతా మని, తెలంగాణ ప్రభుత్వానికి ఎవరితో వైరం ఉండదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పనిచేసుకుంటూ పోతామని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు.
30వేల కోట్ల రుణాలు చెల్లింపు
కేసీఆర్ చేసిన అప్పుల పాపానికి రూ. 30వేల కోట్ల రుణాలు చెల్లించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి నెలా రూ. 6,500 కోట్లు కడుతున్నామని అన్నారు. హరీష్‌రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశారని, ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూశారని, ఇలాంటి వాటిని గుర్తించి కొన్ని కేసులు కూడా నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామని తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆకస్మిక తనిఖీలు కూడా ఇకపై ఉంటాయన్నారు. గోదావరి జలాలను హైదరాబాద్‌కు రెగ్యులర్‌గా వచ్చేలా చేస్తామన్నారు. ఫార్మాసిటీలను విస్తరిస్తామని, అయితే ఒకే దగ్గర ఉంటే సిటీ విడిచి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. అందుకే ఫార్మా విలేజ్‌లాగా ఏర్పాటు చేస్తే.. వాటి నిర్వహణకూడా చేయవచ్చని అన్నారు. కుప్పలాగా ఒకేచోట ఉంటే నిబంధనలుకూడా పాటించరని అభిప్రాయపడ్డారు. ఏర్పాటు చేస్తే.. వాటి నిర్వహణకూడా చేయవచ్చని అన్నారు. కుప్పలాగా ఒకేచోట ఉంటే నిబంధనలుకూడా పాటించరని అభిప్రాయపడ్డారు.
మెట్రోను అమ్ముకుంటే అమ్ముకోనీ..
మెట్రోను ఎల్ అండ్ టీ అమ్ముకుంటే అమ్ముకోనీ అని సీఎం వ్యాఖ్యానించారు. మూసీపై కన్సల్టెన్సీ రిపోర్ట్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని, కేసీఆర్‌లాగా మేధావి కాకపోవడం వల్లనే తాము కన్సల్టెన్సీపై ఆధారపడుతున్నట్టు సీఎం పేర్కొన్నారు. మూసీని ఒక ఆదాయ వనరుగా వాడుకుంటామని అన్నారు. తన ప్రపంచం తెలంగాణే అన్న సీఎం.. వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
మండలాలు, రెవెన్యూ డివిజన్‌లను క్రమబద్ధీకరణ చేయాలని, ఆ తరువాత జిల్లాల ఏర్పాటు ఉంటుందని అన్నారు. కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ను, ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని జిల్లాలుగా ఏర్పాటు చేశారన్నారు. పాల మూరుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, అందుకే పాలమూరు జిల్లాకు స్పెషల్‌గా ఇరిగేషన్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇక పాలనపై దృష్టి
ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టి రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై సమీక్ష చేస్తామని అన్నారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, సన్నబియ్యంపై చర్చిస్తామని సీఎం చెప్పారు. మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేషన్ ఇచ్చేందుకు పరిమితి లేదని.. అది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. రేషన్ దుకాణాల్లో ఎక్కువ సరుకులు తక్కువ ధరకు ఇస్తామని అన్నారు.
విద్యుత్ కోతలు అనేవి కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేట్ వైద్యం, విద్యపై పూర్తిస్థాయి అధ్యయనం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 6న రైతుబంధు పూర్తిగా ఇచ్చేశామని అన్నారు. రాబో యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, లేకపోతే అఖిలపక్షం పెడతామని తెలిపారు. రైతులు రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైతే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో లోన్ తీసుకుంటామని అన్నారు. తడిసిన ధాన్యం విషయంలో వెంటనే చర్యలు తీసుకుంటానన్నారు.




