09-11-2025 01:43:59 AM
బకాయిల సమస్యలతో కాంగ్రెస్ సర్కార్‌పై ముప్పేట దాడి
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాం తి): ఓ ప్రభుత్వ కార్యాలయం వద్ద ఒక వర్గం నిరసన.. మరో కార్యాలయం వద్ద ఇంకో వర్గం ధర్నా.. సమస్యను పరిష్కరించాలని మరొక వర్గం ర్యాలీ.. ఇచ్చిన హామీలు అమ లు చేయాలని రాస్తారోకో.. నిధులు విడుదల చేయాలని అల్టిమేటం.. ఇలా రాష్ట్రంలో అన్ని వైపులా కాంగ్రెస్ సర్కార్‌పై జనాగ్రహం పెల్లుబికుతున్న తాజా పరిస్థితి. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు సైతం అసంతృప్తులతో రగిలిపోతున్న వైనం రాష్ట్రంలో కనిపిస్తోంది.
ఇన్ని వర్గాలు చేస్తున్న ముప్పెటదాడికి కారణం మాత్రమే ఒక్కటే .. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని వేడుకుంటున్నారు.. ఒక్కో చోట ఒక్కో వర్గం నుంచి వెలువడుతున్న అసంతృప్తి వివిధ పద్ధతుల్లో కనపడుతున్నా.. అన్ని చోట్లా.. బకాయిలను చెల్లించాల్సింది మాత్రం ప్రభుత్వమే.
అసంతృప్తి వర్గాలు..
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సర్పంచుల సంఘం, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు... ఇలా ఒకటా రెండా.. రాష్ట్రంలోని అనేక వర్గా లు ఈ అసంతృప్తి వర్గాల్లో చేరిపోతున్నాయి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాల్సిన ప్రభుత్వమే తమకు బకాయి పడినందున.. చేసేదేమిలేక.. తమ అసంతృప్తిని వివిధ మార్గాల్లో వ్యక్తంచేస్తున్నారు. ఇలా పలు వర్గాలు, కాంట్రాక్టర్లు, సంస్థలకు బకాయిలు పడుతుండటం.. పైగా అవన్నీ ఏండ్లుగా పేరుకుపోతుండటంతో.. ఈ మధ్య కాలం లో ఆయా వర్గాలు తమ అసంతృప్తిని వివిధ పద్ధతుల్లో వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
జీవితాలను ప్రభావితం చేసేవిగా మారొద్దు..
గ్రామాల్లో డ్రైనేజీలు, మట్టిరోడ్లు, సీసీ రోడ్లు లాంటి చిన్నా చితకా కాంట్రాక్టు పను లు చేసుకుని బతికేవారికి మూణ్నాలుగు ఏం డ్లుగా చేసిన పనులకు సంబంధించిన బిల్లు లు చేతికి రాకపోతే వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లించాల్సిన ప్రభుత్వమే బిల్లుల చెల్లింపులను పెండింగులో పెడితే.. చేసిన పనులపైనే ఆధారనపడి బతికే చిన్నా.. చితకా వ్యక్తులు ఇబ్బందులపాలవుతారు.
ఇందుకు మాజీ సర్పంచ్‌లే ఉదాహరణ.. 2023 నుంచి చేసిన పనులకు సంబంధించి సుమారు 6 వేల మందికి ఇప్పటికీ చెల్లించాల్సినవి రూ. 531 కోట్లు మాత్రమే. అనేక పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేశారు. అప్పులు తెచ్చి పనులు చేసిన చాలా మంది ఆర్థిక ఇబ్బందు ల్లో పడి ఆత్మహత్య ప్రయత్నాలు చేసినవారు ఉన్నారు.. ప్రాణాలు విడిచివారూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 8 మంది ఆత్మహత్య కు పాల్పడ్డారని సర్పంచ్‌ల సంఘం ఆరోపిస్తోంది.
అలాగే రిటైర్డు ఉద్యోగులు..
రిటైర్డ్ అయ్యేనాటికి వారికి రావాల్సిన బెనిఫిట్స్ వారికి ఇవ్వకపోతే.. 30 ఏండ్లు ప్రభుత్వానికి తమ సేవలు అందించినవారు ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. శేష జీవితం ప్రశాంతంగా ఉందామని వారు ఆశించిన ప్రయోజనం దెబ్బతిం టుంది. అసంతృప్తి వ్యక్తం చేయక తప్పని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. మొన్నటి వరకు ప్రభుత్వంలో భాగస్వాములైన రిటైర్డ్ ఉద్యోగులు.. అదే ప్రభుత్వానికి నిరసన వ్యక్తంచేసే పరిస్థితి రావడం సరైంది కాదు. ఎక్కడ అసంతృప్తి కనపడినా.. తాత్కాలికంగా దానిని సం తృప్తిపర్చేలా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ఆ సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నట్టుగా కనపడుతోంది.
ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై పలు వర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రాధాన్యతా క్రమంలో చిన్నా చితకా కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు లాంటి వారికి మొదట బకాయిలను చెల్లిస్తే.. సమాజంలో అసంతృప్తి వర్గం చల్లారుతుంది. బడా కాంట్రాక్టర్లకు చేసే భారీ చెల్లింపులను కాస్త ఆలస్యంగా చెల్లించి నా.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ ప్రభు త్వం నుంచి రావాల్సిన బకాయిలే తమ జీవనోపాధిగా ఉంటున్న వర్గాలపై ప్రభుత్వం దృష్టి సారించి.. ఆ సమస్యలను ముందుగా పరిష్కరిస్తే.. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అసంతృప్తి తగ్గుతుంది. ఇతర వర్గాలకు అసంతృప్తి వ్యాపించకుండా నివారించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించా లి... సలహాదారులుకూడా ఇలాంటి సమస్యలపై సరైన మార్గంలో వెళ్లేలా ప్రభుత్వ పెద్దల కు సలహాలు ఇస్తూ ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండటం గమనా ర్హం.. ఇక ప్రభుత్వం ‘చేతి’లోనే అంతా ఉంది..!
పార్టీలు మారినా... ప్రభుత్వానిదే జవాబుదారీతనం
అయితే ఇన్ని వర్గాలకు.. ఇంత పెద్ద మొత్తంలో.. ఇంత దీర్ఘకాలంగా పెండింగులో ఉంటూ వస్తోన్న బకాయిలకు ఇప్పటి ప్రభుత్వం చేసినదే కాకపోవచ్చు.. గత ప్రభుత్వం నుంచి పెండింగులో ఉన్నవికూడా ఉన్నాయని సర్కారే గణాం కాలతో తేల్చి చెబుతోంది. ఇప్పుడు అయి నా.. గతం అయినా.. ప్రభుత్వం మాత్రం నిజం. శాశ్వతం.. అనేది అందరూ ఒప్పుకునేదే. బకాయిలు అనేది సహజమైనా.. సుదీర్ఘకాలంగా వాటిని చెల్లించకుండా ఉండటమే ఇక్కడ అసలైన సమస్య.
పార్టీలు ఎన్నైనా మారుతాయి.. కానీ ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ప్రభుత్వం దీర్ఘకాలంగా చెల్లింపులను పెండింగులో పెట్టడం అనేది సమాజంలో ఆయా వర్గాల్లో అసంతృప్తి పెరగడానికి కారణంగా మారుతుందనేది ప్రభుత్వ పెద్దలు గమనించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అధికారాన్ని వెలగబెట్టిన పార్టీ ప్రభుత్వం అయినా.. ఇప్పుడు ప్రజాపాలన చేస్తున్న పార్టీ అయినా.. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది మాత్రం ప్రభుత్వమే.
అది ప్రజల నమ్మకం కూడా. అందుకే గడిచిన రెండేండ్లుగా ఆయా వర్గాల నుంచి విజ్ఞప్తులు, వినతిపత్రాల రూపంలోనే ఈ బకాయిల చెల్లింపులపై వినపడేది. ఇప్పుడది కాస్తా.. అసంతృపిని బహిర్గతం చేసేలా మారింది. అది మరింత ముదిరి.. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బంద్‌ల వరకు వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందికరం. ఇప్పుడు రాష్ట్రంలో అసంతృప్తులనేవి తార స్థాయికి చేరాయి.
గడిచిన కొన్నేండ్లుగా వివిధ వర్గాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు.. వారి కార్యాచరణ ఇలా (ఉదాహరణకు)...
వర్గం/పథకం - ప్రభుత్వ బకాయిలు (రూ.కోట్లలో) - కార్యాచరణ
* తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ: సుమారు రూ.13000 - ఇందిరాపార్క్ వద్ద పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో నవంబర్ 17న మహాధర్నా
* తెలంగాణ ఆల్ రిటైర్స్ అండ్ పర్సన్స్ అసోసియేషన్: సుమారు రూ. 13000 - ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, హెల్త్ కార్డులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం ఈనెల 11 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు
* పీఆర్‌టీయూటీఎస్ సంఘం: సుమారు రూ. 11000 - పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలలో 50శాతం విడుదల చేయాలని డిసెంబర్ వరకు డెడ్‌లైన్, లేకపోతే ఉద్యమ బాట
* బేవరీస్ కంపెనీలు: సుమారు రూ. 3000 - ఈనెల 10 తారీఖులోపు బకాయిలు విడుదల చేయకపోతే డిసెంబర్‌లో మద్యం సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక
* విద్యార్థుల స్కాలర్‌షిప్స్: సుమారు రూ. 9000 - గడిచిన నాల్గేండ్లుగా పెండింగులో ఉన్న స్కాలర్‌షిప్స్‌ను విడుదల చేయాలని ఇప్పటికే పలు దఫాలుగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, నిరసనలు వ్యక్తంచేశారు, అక్టోబర్ 30న బంద్ చేపట్టారు
* ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) : సుమారు రూ. 10000 - బకాయిలు చెల్లించాలని ఈనెల 3 నుంచి రాష్ట్రంలోని సుమారు 2500 విద్యా సంస్థలను బంద్ చేశారు. తాజాగా రూ. 900 కోట్లు విడుదల చేస్తామనే హామీతో శనివారం నుంచి బంద్ విరమించారు
* సర్పంచ్‌ల సంఘం: సుమారు రూ. 531 - అసెంబ్లీని ముట్టడి, సెక్రెటేరియట్ వద్ద నిరసన, సీఎంను, పంచాయతీరాజ్ శాఖా మంత్రిని, ఆఖరుకి గవర్నర్‌కుకూడా వినతిపత్రం ఇచ్చారు. దేవుళ్లకు మొక్కారు, అర్ధనగ్న ప్రదర్శన చేశారు, ప్రజాభవన్‌ను ముట్టడించారు.