ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి
- స్మార్ట్ కార్డులపై పీఎం ఫొటో లేకపోవడం బాధాకరం
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్
మంచిర్యాల క్రైమ్, ఆగస్టు 16 : విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ మొత్తంగా చెల్లించాలని, కేవలం ఈ ఏడాది విద్యార్థులకే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం అన్యాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. ఆది వారం బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్ తో కలిసి ఆయన మాట్లాడారు.
బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రకటన చేసిందని, రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కళాశాలకు ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్ లు ఇవ్వడం లేదన్నారు. దీని వల్ల విద్యార్థులు ఉద్యోగాలు రాక, ఉన్నత విద్యను అభ్యసించ లేక తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు.
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వ ముద్ర, ప్రధాన మంత్రి ఫోటో లేకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఒక్కరికి 5 కేజీల రేషన్ బియ్యం అందిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తామే పూర్తిగా రేషన్ బియ్యం అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
కేంద్ర ప్రభుత్వ ముద్ర, మోదీ ఫోటో లేకుండా రేషన్ కార్డులు పంపిణీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గాజుల ముకేష్ గౌడ్, దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, బేర సత్యనారాయణ, గోలి రాము, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, తుల ఆంజనేయులు, అమెరిశెట్టి రాజ్ కుమార్, పట్టి వెంకట కృష్ణ, బియ్యల సతీష్ రావు, పచ్చ స్వప్న రాణి, మెట్టుపల్లి జయరామ రావు, రంగ శ్రీశైలం, నాంపల్లి శ్రీనివాస్, కర్ర లచ్చన్న, చిరంజీవి, రాకేష్ రెన్వ, కొండ వెంకటేష్, ముదాం మల్లేష్, గాజుల ప్రభాకర్ తతిదరులు పాల్గొన్నారు.






