25 August, 2026 | 4:15 PM

వన మహోత్సవం వేళ చెట్ల నరికివేత

25-08-2026 03:34 PM

* చెట్లను తొలగించవద్దని కొంత మంది.

* కోనోకార్పస్ చెట్లతో ఆరోగ్య సమస్యలు 

* తొలగించాలని మరి కొంతమంది రోడ్డుపై బైఠాయింపు 

* సముదాయించిన స్థానిక పోలీసులు 

ముస్తాబాద్,ఆగస్టు 25( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో వన మహోత్సవాలకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం జరుపుతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుండగా ముస్తాబాద్ లోని ఓ కాలనీలో డివైడర్ మధ్యలో ఉన్న  చెట్లను నరికివేయడం స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. చెట్లను నరికివేస్తున్న విషయం తెలుసుకున్న కొంత మంది స్థానికులు అక్కడికి చేరుకొని వన మహోత్సవం సందర్బంగా మొక్కలు నాటడం మానేసి ఉన్న చెట్లు నరకడం ఏంటని ప్రశ్నించడం తో మిగిలిన చెట్లను నరకడం నిలిపివేశారు.ఆ కాలనీ వాసులు మాత్రం ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న ఈ చెట్లను తొలగించాలని ధర్నాకు దిగారు.

కోనో కార్పస్ చెట్లను తొలగించాలి  

స్థానికుల అడ్డంకి తో చెట్లను నరకడం ఆపేయడంతో అక్కడి కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.కోనోకార్పస్‌ చెట్ల కారణంగా తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికే నరికివేసిన చెట్లతో పాటు మిగిలిన కోనోకార్పస్‌ చెట్లను కూడా పూర్తిగా తొలగించాలని డిమాండ్‌ చేశారు.త్వరగా పెరుగుతూ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో గత ప్రభుత్వం రోడ్ల పక్కన,డివైడర్లలో విరివిగా నాటిన సంగతి అందరికి తెలిసిందే.కానీ ప్రస్తుతం పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరమని గుర్తించి పలు రాష్ట్రాల్లో వీటిని నిషేధిస్తున్నారని కోనోకార్పస్ మొక్కల వల్ల  పుప్పొడి రేణువుల  ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల పదే పదే చెపుతున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ చెట్లపై పక్షులు గూళ్లు కట్టుకోవడానికి ఇష్టపడవు వీటి ఆకులను పశువులు కూడా తినవు అలాంటిది రోజు ఈ చెట్ల గాలిని పీల్చుకుంటూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నామని కాలనీవాసులు తెలిపారు. ప్రజారోగ్యాన్ని పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని నూతనంగా కోనోకార్పస్ మొక్కలను నాటకూడదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయని. వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయంగా  మొక్కలను పెంచాలన్నారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.రోడ్డుపై బైఠాయించిన స్థానికులతో మాట్లాడి పరిస్థితిని వివరించి సముదాయించారు.సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు