అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి
జిఎంకు వినతిపత్రం అందజేసిన ఐఎన్‌టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి
విద్యుత్ అంతరాయాల నివారణ, పరికరాల తనిఖీలకు రవాణా సౌకర్యం అవసరం
సత్తుపల్లి, ఆగస్టు 25:( విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియాలో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఏరియా అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలని కోరుతూ సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారిని ఐఎన్‌టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తీగల క్రాంతికుమార్ మాట్లాడుతూ సత్తుపల్లి ఏరియా పరిధిలోని జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, జేవీఆర్ సీహెచ్‌పీ, జేవీఆర్ డిస్పెన్సరీ, గెస్ట్‌హౌస్, ఇల్లందు బంగ్లాస్, పీవీఎన్‌ఆర్ కాలనీకి సంబంధించిన సబ్‌స్టేషన్ మరియు ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించిన అవుట్‌డోర్ పనులు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు గనుల ప్రదేశాలకు వెళ్లడం, కాలనీల సబ్‌స్టేషన్లలో విద్యుత్ అంతరాయాల నివారణ, ఎలక్ట్రికల్ పరికరాల తనిఖీలను సమయానుకూలంగా పూర్తి చేయడానికి రవాణా సౌకర్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం తగిన రవాణా సౌకర్యం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సత్తుపల్లి ఏరియాలో అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ పనులను సక్రమంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ విభాగానికి ప్రత్యేకంగా కన్వీనియన్స్ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్, ఐఎన్‌టీయూసీ తరఫున జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారిని కోరారు. దీనిపై ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి సానుకూలంగా స్పందిస్తూ, ఏరియా అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపిస్తానని తెలిపారు.






