చీకట్లో చెట్ల నరికివేత..!
- కొండలు పిండి చేసి చెట్లను నేలకూలుస్తున్న అక్రమార్కులు
- నిద్రపోని గచ్చిబౌలిలో అర్ధరాత్రి తవ్వకాలు.. తెల్లవారేసరికి నిశ్శబ్దం
- స్థానికుల ఆవేదన.. వన్యప్రాణుల విలవిల..
శేరిలింగంపల్లి, జూన్ 12 (విజయక్రాంతి): రాత్రి 12 గంటలకు నగరం ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంటే, హైదరాబాద్ ఐటీ కారిడార్లోని కంచె-గచ్చిబౌలి, ఖాజాగూడ పరిసర ప్రాంతాలు మాత్రం భారీ యంత్రాల గర్జనలతో మార్మోగిపోతున్నాయి.రాత్రికి రాత్రే కొండలు పిండి అవుతున్నాయి, దాశతాబ్దాల చరిత్ర కలిగిన చెట్లు నేలకూలుతున్నాయి. నగరంలో మిగిలిన చివరి పచ్చదనం, సహజ రాతి కొండలు కూడా ఈ చీకటి పర్వంలో అంతరిస్తున్నాయి.
కంచె గచ్చిబౌలి, ఖాజాగూడ ప్రాంతం హైదరాబాద్లో మిగిలిన ఏకైక ప్రకృతి ఆవాసం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఐటీ సంస్థల విస్తరణ పేరిట ఇక్కడ నిరంతరం అక్రమ తవ్వకాలు, చెట్ల నరికివేత జరుగుతోంది. పగటిపూట నిబంధనలు, ట్రాఫిక్ సమస్యలు ఉంటాయనే నెపంతో రాత్రి సమయాన్ని ఆసరా చేసుకుని నిర్వాహకులు పనులు చేపడుతున్నారు.
అర్ధరాత్రి తవ్వకాలు తెల్లవారేసరికి నిశ్శబ్దం..
అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ జేసీబీలు, రాళ్లు పగలగొట్టే బ్రేకర్లు, లారీలు రంగంలోకి దిగుతున్నాయి. వందలాది లారీల్లో తవ్విన మట్టి, పగలగొట్టిన రాళ్లను తెల్లవారేసరికి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్న వృక్షాలను వేళ్లతో సహా పెకలించి పక్కకు పడేస్తున్నారు.నిన్న చూసిన కొండ ఈరోజు మాయం,నిన్న మొలిచిన పచ్చదనం నేడు కనిపించడం లేదు.
స్థానికుల ఆవేదన వన్యప్రాణుల విలవిల..
రాత్రంతా జరిగే తవ్వకాల వల్ల వచ్చే శబ్ద కాలుష్యం, ధూళి కారణంగా స్థానిక నివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ఈ ప్రాంతంలో స్వస్థానం చేసుకున్న నెమళ్లు, ఉడుములు, వివిధ రకాల పక్షులు, వన్యప్రాణులు తమ ఆవాసాలు కోల్పోయి రోడ్లపైకి వస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి రాత్రంతా సాగుతున్న ఈ పర్యావరణ ధ్వంసానికి అడ్డుకట్ట వేసేవారే లేరా? అని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
నివాస ప్రాంతాల సమీపంలో రాత్రి వేళల్లో భారీ శబ్దాలు చేసే యంత్రాల వాడకం నిషేధం, చెట్లు నరకాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి, పర్యావరణ అనుమతులు లేకుండా రాళ్లు, మట్టి తవ్వకాలు చేయడం అక్రమం, అయినప్పటికీ ఈ నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదని పర్యావరణవేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.
అభివృద్ధి అవసరమే.. కానీ భవిష్యత్ తరాలకు ఊపిరి అందించే ప్రకృతిని రాత్రికి రాత్రే మింగేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్న ప్రకృతి ప్రేమికులు, ఇప్పటికైనా అధికారులు స్పందించి గచ్చిబౌలి కంచె ప్రాంతంలో జరుగుతున్న అక్రమ రాత్రి తవ్వకాలు, చెట్ల నరికివేతను వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






