29 July, 2026 | 2:12 AM

విజ్ఞాన్స్‌లో రత్తయ్య జన్మదిన వేడుకలు

29-07-2026 01:17 AM

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య జన్మది న వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వక్తృత్వం, కవిత్వం, వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్, మాక్ అసెంబ్లీతో పాటు టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, టేబుల్ టెన్నిస్ వంటి వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు.

అలాగే పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమం మరియు ‘మెడికవర్’ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ.. యువతలో కేవలం విద్య మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత, మానవతా విలువలు పెంపొందినప్పుడే సమాజంలో మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

విద్యారంగంలో డాక్టర్ లావు రత్తయ్య చేసిన కృషి అనిర్వచనీయమని, ఆయన దూరదృష్టి, నిస్వార్థ సేవ విజ్ఞాన్ సంస్థలను ఈ ఉన్నత స్థాయికి తీసుకువచ్చాయని కొనియాడారు. కార్యక్రమంలో విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సీఈవో బోయపాటి శ్రవణ్, విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు పాల్గొన్నారు.