18-07-2025 05:56:46 PM
సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ
పెన్ పహాడ్: వానకాల సీజన్ లో రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ ముందస్తు ప్రణాళికలు లేకుండానే పాలన చేయడం బాధాకరమని సిఐటియు జిల్లా జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం దగ్గర వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోక పోవడం వల్ల రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో లేకపోవడం.
రైతులకు బ్యాంకు రుణాలు అందక వ్యవసాయ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం కల్తీ విత్తనాలు, పురుగుల మందుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని అందుకు కారణం ప్రభుత్వాలు నిర్లక్ష్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.