నేటి నుంచి అసెంబ్లీ
- గవర్నర్ ప్రసంగంతో మొదలు
- 20న బడ్జెట్.. నెలాఖరు వరకు సమావేశాలు!
- వాడివేడిగా చర్చలకు సిద్ధ్దమవుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
- ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి) : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెలాఖరు దాకా సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం కానుంది. ఈనెల 20న ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు.
కాగా, ఈ దఫాలో అనేక అంశాలపైన ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనేక వివాదాస్పద అంశాలపైనా ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. తాజాగా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన అనేక సమస్యల్లో ప్రధానంగా వంటగ్యాస్, పెట్రోల్ వంటి అంశాలు తీవ్రంగా ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నది. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలు, సర్కారు విధానా న్ని ప్రజలకు తెలిపేలా సభలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడతారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపైన చేపడుతున్న ప్రాజెక్టులపైన ప్రభుత్వం, అధికారపార్టీ తరఫున వివరణ ఇవ్వనున్నట్టు తెలిసింది. గతంలో అసెంబ్లీలో కృష్ణా నదీజలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గోదావరి జలాలపైన మరింత స్పష్టత కోసం సభలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఇక సింగరేణిలో నైనీకోల్ బ్లాక్ అంశంపై ఇటీవల వివాదం చెలరేగి రాజకీయ దుమారానికి దారితీసింది. దీంతో గనుల టెండర్లపై అవినీతి ఆరోపణలు తదితర అంశాలు అసెంబ్లీలో చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపైనా తమ ఎమ్మెల్యేలు సమాధానాలు ఇచ్చేలా మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
మూసీపై పొలిటికల్ వార్?
మూసీ ప్రక్షాళన, సరోవర్ ప్రాజెక్టు వంటి అంశాలు కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్నది. దీనిపైనా సభలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఖమ్మంలో భూదాన్ భూముల అంశం సైతం హాట్ టాపిక్‌గా మారింది. ఇది కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీనిపైనా విపక్షాల ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు తమ సభ్యులు ప్రిపేరవుతున్నారని అధికారపార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అన్ని అంశాలపైనా ధీటుగా మాట్లాడేందుకు, ఆయా అంశాలపైనా ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేలా కాంగ్రెస్ నుంచి స్పష్టతను ఇచ్చే ప్రసంగాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
నేడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ..
అసెంబ్లీ ఆవరణలో నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవవంత్‌రెడ్డి కలిసి ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ఆవరణలో ఇప్పటికే గాంధీ విగ్రహం ఉండగా, ఒక వైపు అంబేద్కర్ విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ విగ్రహానికి మరో వైపు ఏర్పాటుచేశారు. ఇంతకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అసెంబ్లీ ఆవరణలోనూ ఏర్పాటు చేశారు.
సభలు సజావుగా జరిగేలా చూడాలి
- సభ్యులు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు అందించాలి
- అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉండాలి
- అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- ప్రభుత్వం నుంచి పూర్తి సహకరం ఉంటుంది : మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో సభా నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీ హాల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగ్రత్తలు తీసుకోవాలని, సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పేలా అధికారులు సిద్దంగా ఉండాలని సమావేశంలో సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. గత సమావేశాలు అందరి సహకారంతో సగావుగా నిర్వహించుకున్నామని, ఈ బడ్జెట్ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు.
బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతమైనవి కావడమే కాకుండా ఎక్కువ రోజులు సభ జరుగుతుందన్నారు. సభ లోపల, బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు సజావుగా జరుగుతాయని, అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. . ప్రభుత్వానికి, శాసనసభకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని సూచించారు.
శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలి. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని, తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని స్పీకర్ వివరించారు.
ఈసారి కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు ఒకే ప్రదేశంలో జరుగుతున్నాయి కాబట్టి అదనపు ఏర్పాటు ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని, అవసరమైన నోడల్ అధికారులను , లైజనింగ్ ఆఫీసర్లను నియమించాల, పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.
సమావేశాలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సభలు సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహాయ, సహకారాన్ని అందిస్తామన్నారు. కోఆర్డినేషన్ కోసం ప్రతిశాఖ నుండి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు.
ఈ సమావేశంలో మండ లి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, శాసన నమండలి, అసెంబ్లీ కార్యదర్శులు వి. నరసింహా చార్యులు, రేండ్ల తిరుపతి, సీఎస్ రామకృష్ణారావు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రటరీ -రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ సెక్రటరీ- గౌరవ్ ఉప్పల్, స్పెషల్ సెక్రటరీ - సిక్తా పట్నాయక్. డీ.జీపీ శివధర్ రెడ్డి, పోలీసు ఉత్నతాధికారులు మహేష్ భగవత్, విజయకుమార్, సజ్జనార్, అవినాష్ మహంతి, రమేష్, అసెంబ్లీ, మండలి చీఫ్ మార్షల్స్- కర్ణాకర్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.




