calender_icon.png 16 February, 2026 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోడెడ్ల గంటల గలగలలు.. భక్తుల జయజయ ద్వానాలతో మార్మోగిన ఏడుపాయల

16-02-2026 09:14:52 PM

* రెండో రోజు అట్టహాసంగా సాగిన బండ్ల ఊరేగింపు 

* వనదుర్గమ్మ దర్శనంతో తరించి.. తపించిన భక్తజనం 

* ఆధ్యాత్మికం, పర్యాటకం ఏడుపాయల అడవి సొంతం 

* పాపన్నపేట సంస్థానాధీశుల జోడేడ్ల బండికి పూజలు చేసి ఉత్సవం ప్రారంభించిన ఆలయ ఈవో

పాపన్నపేట: అందమైన వనాలు.. ఆధ్యాత్మికం ఉట్టిపడే ఆలయం.. ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం.. గలగల పారే మంజీరా పరవళ్ళు.. ఆలయం చుట్టూ కొండలు, గుహలు ఇవన్నీ భక్తుల ఇలవేల్పుగా నిలవైన ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం సొంతం. ఈ చోటుకు వస్తే చాలు మదినిండా ఎన్నో అనుభూతులు నింపుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆనంద పారవశ్యంలో మునిగి తేలవచ్చు. ఏడుపాయల మహా జాతరలో ఎటుచూసినా భక్తుల సందడి.

ఎద ఎద భక్తి భావంతో.. మదినిండా పరవశంతో లక్షలాదిమంది భక్తుల ఇలవేల్పయిన వనదుర్గమ్మ కొలువైన ఏడుపాయల క్షేత్రం భక్తి సాగరమైంది. వనదుర్గమ్మ నామస్మరణతో దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరికొందరు దర్శించుకోవడానికి కదిలోస్తున్నారు. తనివితీరా అమ్మను దర్శించుకుని పులకించి పోతున్నారు. సంతానం కోసం సంతానగుండంలో స్నానాలు చేయగా మరికొందరు భక్తులు తలనీలాలు, బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నోట వనదుర్గమ్మ తల్లీ.. చల్లంగా చూడమ్మా.. అంటూ జయ జయ ద్వానాలు మార్మోగుతున్నాయి.

జోరుగా సాగిన జోడెడ్ల బండ్ల ఊరేగింపు..

వనదుర్గమ్మ క్షేత్రంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతున్న మహా జాతరలో ప్రధాన ఘట్టం జోడేడ్లబండ్ల ఊరేగింపు. ఇట్టి ఘట్టాన్ని సోమవారం జోరుగా నిర్వహించారు. ముందుగా పాపన్నపేట సంస్థానాధీశుల జోడెడ్ల బండిని సోమవారం ఉదయాన్నే పాపన్నపేట గ్రామస్తులు ఘనంగా ఊరేగింపు నిర్వహించి జాతర మహోత్సవానికి సాగనంపారు. సాయంత్రానికి ఏడుపాయలకు చేరుకున్న సంస్థానాధీశుల బండికి ఈవో వీరేశం, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం జోడెడ్ల బండ్ల ఊరేగింపును అట్టహాసంగా ప్రారంభించారు ఆయా గ్రామాల నుంచి వచ్చిన ఎడ్లబండ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. రంగురంగుల చీరలు, కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు, దేవతామూర్తుల చిత్రపటాలతో బండ్లను సుందరంగా తీర్చిదిద్దారు. బండ్ల ముందు ఆయా గ్రామాల యువకులు డప్పు చప్పుళ్ల మధ్య సందడి చేస్తూ నృత్యాలు చేశారు. శివసత్తులు శిగాలూగుతుండగా.. పోతురాజులు గావు కేకలు.. జోడెడ్ల గంటల గలగలలు.. భక్తుల జయ జయ ద్వానాలతో ఏడుపాయల రాతి కొండలు మార్మోగాయి.

ఏడుపాయల ముఖద్వారం నుంచి అమ్మవారి ఆలయ రాజగోపురం ముందు నుంచి బండ్ల ఊరేగింపు కొనసాగింది. జాతరలో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్స్, చిన్నారుల ఆట బొమ్మలు, టూరింగ్ టాకీసులు, టాటూస్, భక్తులకు ఆటవిడుపును కలిగించాయి. బండ్ల ప్రదర్శనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు కల్పించారు. ఆలయ ఈవో వీరేశం, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వారి పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య మెరుగుకు సిబ్బంది అనునిత్యం శ్రమిస్తున్నారు.

మంగళవారం రథోత్సవంతో ముగియనున్న సంబురం

మహా జాతరలో చివరి ఘట్టమైన రథోత్సవం మంగళవారం రాత్రి నిర్వహించనున్నారు. రంగురంగుల కలర్లు, పుష్పాలతో రతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్తు దీపాల కాంతులతో అందంగా అలంకరించి అందులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తారు. అనంతరం రథం గోలి వద్ద నుంచి తాళ్లతో భక్తులు లాగుతూ.. వనదుర్గా మాత ఆలయం ముందు వరకు రథయాత్రను కొనసాగిస్తారు. దీంతో ఏడుపాయల మహా జాతర ఉత్సవాలు ముగుస్తాయి.