27 March, 2026 | 1:39 AM

పశ్చిమాసియాలో భీకర పోరు

27-03-2026 12:00 AM
  1.   27వ రోజూ కొనసాగిన వైమానిక దాడులు
  2. అబుదాబీలో క్షిపణి దాడిలో ఇద్దరు మృతి.. మరణించిన వారిలో ఒకరు భారతీయుడు 
  3. ఇరాన్‌లో ఇప్పటి వరకు 1,937 మంది, లెబనాన్‌లో 1,094 మంది మృతి

టెహ్రాన్/ వాషింగ్టన్/ బీరుట్/అబుదాబీ, మార్చి 26: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది. 27వ రోజు కూడా మధ్య ఆసియాలో వైమానిక, క్షిపణులు, డ్రోన్ల దాడులు మారు మోగాయి. టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా-ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబులు కురిపించింది. గత 27 రోజులుగా మశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఐఆర్జీసీ నావికా దళ ఇంటెలిజెన్స్ అధిపతిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గారడ్స్ నావికా దళ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి బెహ్నామ్ రెజాయ్‌ని విజయవంతంగా హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.

గత 24 గంటల్లో తమ దాడుల్లో ఐఆర్జీసీ నావికా దళానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులలో హతమైనట్లు ఇజ్రాయెల్ పేర్కొన్న రెండో వ్యక్తి ఈయనే. ఐఆర్జీసీ నావికాదళ కమాండర్ అలీరెజా తంగ్సిరి కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్లు సమాచారం. అయితే అబుదాబిలో క్షిపణి శకలాల తాకిడికి ఇద్దరిలో ఒక భారతీయుడు మృతి చెందాడు. ఈ మేరకు జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించంది. 

యుద్ధంలో తమ దేశంలో ఇప్పటివరకు 1,937 మంది మరణించారని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్‌లో యుద్ధం కారణంగా మృతుల సంఖ్య కనీసం 1,937కు చేరిందని ఇరాన్ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు.  మృతుల్లో 240 మంది మహిళలు, 212 మంది చిన్నారులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 24,800 మందికి పైగా గాయపడ్డారని  స్పష్టం చేశారు.

మరోపక్క ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 1,094 మంది మృతి చెందారని లెబనాన్ అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ దాడులను తీవ్ర తరం చేయడంతో ఇజ్రాయెల్ అంతటా భారీ పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ నుంచి మరో విడత క్షిపణులు రానున్నాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. తర్వాత, టెల్‌అవీవ్, మోడిన్, జెరూసలేం ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ అణు కేంద్రాల ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. 

ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుం చి దాదాపు 300 మంది అమెరికా సైనికు లు గాయపడ్డారని సెంట్రల్ కమాండ్ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో మౌంట్ డోర్‌పై రాత్రిపూట జరిపిన ఆపరేషన్లో ‘లెబనీస్ బ్రిగేడ్స్‘ కమాండర్‌ను తమ ఓజ్ యూనిట్ అరెస్ట్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన ఒక క్లస్టర్ క్షిపణి కిరియత్ ష్మోనాలోని ఒక ప్రాంతంపై పడిందని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. పేలని మందుగుండు సామగ్రి కోసం బృం దాలు గాలిస్తున్నాయి. ఈ దాడులకు హిజ్బు ల్లా బాధ్యత వహించింది.

 హోర్ముజ్‌లో 2,000 నౌకలు..

హోర్ముజ్ జలసంధిలో 2,000 నౌకలు, 20,000 మంది నావికులు చిక్కుకుపోయారని ఐఎంఓ చీఫ్ తెలిపారు. ఈ పరిస్థితి ప్రపంచ నౌకా రవాణాకు ఒక పెద్ద సవాలు అని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ జాప్యం వల్ల సిబ్బందిలో ఒత్తిడి, అలసట పెరుగుతున్నాయని, నౌకలకు అవసరమైన సరఫరాలు కూడా తగ్గిపోతున్నాయని ఆయన హెచ్చరించారు.