టీచర్ల పదోన్నతులు ఎలా చేపడతారు?
కోర్టు వివాదం కొలిక్కి రాకుండా ఎలా చేస్తారు?
పాఠశాల విద్యా శాఖపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం సింగిల్ జడ్జి వద్ద విచారణలో ఉండగానే ఆ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టులో వివాదం ఉండగా పదోన్నతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ వివాదాన్ని తిరిగి సింగిల్ జడ్జికి పంపింది. ఈ విషయం తెలిసి కూడా పదోన్నతుల ప్రక్రియను ఎలా చేపడతారని హైకోర్టుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను నిలదీసింది.
ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది కదా? అనిప్రశ్నించింది. టెట్‌కు సంబంధించి రెండు వేరువేరు ఉత్తర్వులు ఉన్నందున వాటిని విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి డివిజన్ బెంచ్ సూచించిన తర్వాత పాఠశాల విద్యా శాఖ పదోన్నతుల ప్రక్రియను చేపట్టడంలో ఆంతర్యం ఏమిటని అసహనం వ్యక్తంచేసింది. పదోన్నతులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్ అర్హత సాధించని ఎస్జీటీలకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమంటూ సుమారు 150 మంది హైకోర్టును ఆశ్రయించారు. టెట్‌తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ కల్పించాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సుమారు 52 మంది దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లను మంగళవారం జస్టిస్ అభినంద్ కుమార్ సావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
పాతవారికి టెట్ అవసరంలేదు!
టెట్ అర్హత లేనివారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పించడం అన్యాయమని పిటిషనర్ లాయర్ పీఎస్ రాజశేఖర్ వాదించారు. ప్రతివాదులు 1995 మధ్య ఎస్జీటీలుగా నియమితులయ్యారని ప్రతివాదుల న్యాయవాది ఎం రాంగోపాల్‌రావు చెప్పారు. ఎన్సీటీఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని, దీని ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరని వివరించారు. నోటిఫికేషన్‌కు ముందే నియమితులైన వాళ్లకు టెట్ అవసరంలేదని 2015లో ప్రభుత్వం జీవో 36ను జారీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు పదోన్నతులు పొందుతున్నవారు 2010కి ముందు నియమితుయ్యారని, వాళ్లకు ఎన్సీటీఈ నోటిఫికేషన్‌ను గమనంలోకి తీసుకోవడం చెల్లదని వాదించారు.
ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే పదోన్నతుల ప్రక్రియ మొదలు పెట్టామని, ఇందులో టెట్ అర్హతలే నివారినీ పరిగణనలోకి తీసుకున్నామని శ్రీదేవసేన చెప్పారు. దీంతో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వివాదాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకు పంపిన విషయం తెలిసి కూడా ప్రమోషన్ల ప్రక్రియన ఎలా ప్రారంభిస్తారని నిలదీసింది. ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని, తాజాగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అప్పీళ్లపై విచారణను మూసివేసింది. ఇప్పటికే ఇచ్చిన పదోన్నతుల ఉత్తర్వులను ఉపసంహరించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొనేందుకు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది.






