10 July, 2026 | 4:07 AM

జోరుగా ఫిల్టర్ ఇసుక దందా..! ఆ లీడర్లుదే కీలక పాత్ర

10-06-2024 06:05 PM

అధికార పార్టీకి చెందిన ముఖ్య లీడర్లే కీలక పాత్ర

కూతవేటు దూరంలో ఉన్న కేసరి సముద్రం చెరువులోనే తయారీ కేంద్రం

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

నాగర్‌కర్నూల్: జిల్లాలో ఫిల్టర్ ఇసుక దందా జోరుగా జరుగుతుంది. ప్రభుత్వ భూములు, గుట్టల్లో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి ఆ మట్టిని ట్రాక్టర్ లో నింపి చెరువు పరిసర ప్రాంతాల్లో ఇసుక మాఫియా గ్యాంగ్ కృత్రిమంగా ఫిల్టర్ ఇసుక తయారీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి జంప్ చేసిన బీఅర్ఎస్ కౌన్సిలర్లు, ఇతర బిఆర్ఎస్ ముఖ్య లీటర్లు కలిసి ఫిల్టర్ ఇసుక దందాకు తెర లేపుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి కూతవేట్టు దూరంలో ఉన్న ఎండబెట్ల శివారులోని కేసరి సముద్రం చెరువులో ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

కొంతమంది అధికార పార్టీలో ఉన్న కౌన్సిలర్ వారి భర్తలు అక్రమ సంపాదన కోసం ఇసుక దందా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి ఉన్న వాహనాలు సైతం ఫిట్నెస్ లేకుండానే మైనర్ ల చేత రాష్ట్ర డ్రైవింగ్ చేస్తూ ఇసుక అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు కట్టపై నుంచి ఫిల్టర్ ఇసుక కోసం అక్రమంగా మట్టిని తరలిస్తూ ట్రాక్టర్ కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.