12-11-2025 12:33:07 AM
ఘట్‌కేసర్, నవంబర్ 11 (విజయక్రాంతి) : నరనరాన తెలంగాణ నినా దంతో.. తెలంగాణ తల్లికి జేజేలు పలికిన లోకకవి అందెశ్రీకి తెలంగాణ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ఘట్‌కేసర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీ స్ సమీపంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. ముందుగా హైదరాబాద్‌లోని లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి ఘట్‌కేసర్ వరకు అశేష అభిమానులు వెంటరాగ అందెశ్రీ అంతిమ యాత్ర సాగింది.
తార్నాక, ఉప్పల్ మీదు గా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చేరింది. అక్కడ అందెశ్రీ నిర్మించుకుంటు న్న భవనం వద్ద భౌతికకాయాన్ని ఉంచా రు. కళాకారుల ఆటపాటలతో డప్పు చప్పుళ్ల మధ్య అందెశ్రీ అమర్ హై నినాదాలు మిన్నంటాయి. అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య అధికారిక లాంఛనాలతో జరిగాయి.
అంతిమయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం అందెశ్రీ భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అందెశ్రీ పాడే మోసి కడసారి వీడ్కోలు పలికారు.
ఆ తరువాత ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్రలో భారీగా కవులు, కళాకారులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజా గాయకులు విమలక్క, ఏపూరి సోమ న్న, అశోక్, వెన్నెల, మాజీ కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్‌లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
పాఠ్య పుస్తకాల్లో ‘జయ జయహే తెలంగాణ’ : సీఎం
రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన కవి, రచయిత అందెశ్రీని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే కాకుండా తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని పాఠ్య పుస్తకాల్లో ‘జయ జయహే తెలంగాణ’ గీతం పెడతామని తెలిపారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభు త్వం ఉద్యోగం ఇస్తామని, తెలంగాణలో అందెశ్రీ పేరు శాశ్వతంగా ఉండే విధంగా ఆయన సమాధి స్థలాన్ని స్మృతివనం తీర్చిదిద్దుతామన్నారు.
ఆయన తెచ్చిన ‘నిప్పుల వాగు’ కవితా సంకలనం ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నారు. తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌గా ఉపయోగపడు తుందన్నారు. ఆయన రచనలతో 20 వేల పుస్తకాలను ముద్రించి రాష్ట్రంలోని ప్రతీ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
అందెశ్రీ ప్రతి మాట, పాట ప్రజా జీవితంలో నుంచే పుట్టుకొచ్చిందేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పోషించిన పాత్ర అమోఘమని కొనియాడారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రా న్ని కోరతామని, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇందుకు సహకరించాలని కోరారు. ప్రధానిని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.