26 February, 2026 | 3:19 AM

మానవత్వానికే మచ్చ

26-02-2026 01:36 AM

కుల దురహంకారంతో పసిగుడ్డును చిదిమేస్తారా?

  1. ఈ పాపం ముమ్మాటికీ పాలకులదే!
  2. నిందితులను కఠినంగా శిక్షించాలి
  3. బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
  4. కుమ్మెర గట్టు బాధితులను పరామర్శించిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

* మనిషి పుట్టిన తర్వాత ఐదు నిమిషాలకు కులం వచ్చి చేరుతుంది.. మనిషి పుట్టిన తర్వాత ఐదు నిమిషాలకు మతం వచ్చి చేరుతుంది.. ఈ కుల మతాలు మనిషి సృష్టించుకున్నవే. కులాల పేరిట, మతాల పేరిట అహంభావమేమిటి? పొత్తిళ్లలో రెండునెలల పసికందుకు పాలు ఇవ్వాల్సిన తల్లి.. ఇదిగో ఇక్కడ కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నది.

 బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

నాగర్‌కర్నూల్ ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కుమ్మెర గట్టు జాతరలో మానవత్వాన్ని మంటగలిపేలా వ్యవహరించిన నిందితులను శిక్షించాల్సిన బాధ్యత ఈ పాలకులదేనని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. అభం శుభం తెలియని రెండు నెలల పసి గుడ్డు తన తల్లిదండ్రులతో మల్లన్న దర్శనం కోసం వచ్చిందేగాని, మీరు కులుకుతున్న గద్దెను అడిగిందా? మీరు కూడబెట్టుకున్న సంపాదన అడిగిందా.. అని ఆయన ప్రశ్నించారు.

మానవత్వం కలిగిన ప్రతిమనిషి చలించిపోక తప్పని ఘటన ఇది అని, ఇది సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని కేటీఆర్ అన్నారు. క్రూరంగా వ్యవహరించిన ఆ నిందితులు స్వేచ్ఛగా బయటతిరిగే అవకాశం కల్పించింది ఈ పాలకులేనని ఆయన మండిపడ్డారు. గుండెలు అవిసిపోయేంత హృదయవిదారక ఘటన జరిగినప్పటికీ.. ఇప్పటికీ పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం అప్రజాస్వామికమన్నారు.

పేదలు దర్శనానికి వెళితే మరణశాసనం రాసిన పెత్తందారులను జైళ్లకు పంపాల్సిందేనని ఆయన మండిపడ్డారు. బుధవారం నాగర్‌కర్నూల్ పర్యటన సందర్భంగా కుమ్మెర గట్టు మల్లన్న స్వామి జాతర వద్ద జరిగిన ఘటనలో రెండు నెలల బిడ్డను కోల్పోయిన దంపతులను కేటీఆర్ ఓదార్చారు. అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరంలో కుమ్మెర గ్రామానికి చెందిన గణేష్ మౌనిక దంపతులను, ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

రెడ్డి కులస్తులు రజక కుటుంబంపై దాడిచేసిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 1౦ లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి సాయపడతామని చెప్పినా, తమపై కులం పేరుతో దూషిస్తూ మూకుమ్మడి దాడిచేసి తన బిడ్డ మరణానికి కారణమైన నిందితులను శిక్షించాలని బాధిత కుటుంబం కోరుతున్నట్లు ఆయన చెప్పారు. 

అమానవీయంగా పసికందు ప్రాణాలు తీసినవారిని వెనుకేసుకు వస్తే వారిని సైతం దోషులుగా పరిగణించాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. దైవదర్శనానికి టికెట్లు ఎందుకు కొనాలని అడిగినందుకే పసికూనపై దాడిచేస్తారా అని మండిపడ్డారు. ఇలాంటి హృదయవిదారక ఘటనలు జరిగినప్పుడు పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించాల్సిందిపోయి, బాధితులు దరఖాస్తు పెట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ‘మనిషి పుట్టిన తర్వాత ఐదు నిమిషాలకు కులం వచ్చి చేరుతుంది..

మనిషి పుట్టిన తర్వాత ఐదు నిమిషాలకు మతం వచ్చి చేరుతుంది.. ఈ కుల, మతాలు మనిషి సృష్టించుకున్నవే. కులాల పేరిట, మతాల పేరిట అహంభావమేమిటి? పొత్తిల్లలో రెండునెలల పసికందుకు పాలు ఇవ్వాల్సిన తల్లి.. ఇదిగో ఇక్కడ కూర్చోని కన్నీళ్లు పెట్టుకుంటున్నది’ అని ఆయన ఉద్వేగంగా చెప్పారు. కులహంకారంతో పసిపాప ప్రాణాలు బలిగొన్న ఈ దారుణ ఘటనతో తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్ట డం దారుణమన్నారు.

రాష్ట్రంలో పాలకులు రాజ్యాంగాన్ని సైతం ఖననం చేశారని, పోలీసు లు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ సామాన్యులకు న్యాయాన్ని దూరం చేస్తున్నారని మండి పడ్డారు. పసికందు మృతికి కారణమైన ఎనిమిది మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తనను అడ్డుకునే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు.

పసిపాప మరణానికి కారణమైన 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు మర్డర్ కేసును నమోదు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయంజరిగేదాకా తాను అండగా ఉంటానని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ తమ పార్టీ ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుందన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి తక్షణసాయంగా ఆయ న స్వయంగా లక్ష రూపాయలు అందజేశారు. పార్టీ నుంచి 10 లక్షల సహాయాన్ని ప్రకటించారు. 

ఉద్యమాల పురిటి గడ్డపై..:- ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

అనేకమంది నాయకులకు, ఉద్యమకారుల కు పురుడుపోసిన ఈ గడ్డపై పసికూనను పొట్టనపెట్టుకున్న ఘటన జరగడం దారుణం అని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోర టి వెంకన్న అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటా యి, పోతుంటాయి అని పాలకులు ఎవరైనా సామాజిక బాధ్యతను విస్మరించరాదని అన్నా రు. దోషులను అరెస్టుచేసి సామాజిక న్యాయా న్ని కాపాడే విధానం ఇక్కడినుండే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఇది దారుణం: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

కుమ్మెర జాతరలో వేలాదిమంది చూస్తుండగా బలహీనవర్గాల వ్యక్తులపై దాడులుచేస్తూ పైశాచికానందం పొందడం దారుణమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరాచకాలకు చిరునా మాగా నిలిచిన కుమ్మెరలో సామాజిక న్యా యం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్ర మాలకు పాల్పడుతున్న పెత్తందారులను రాజ్యాంగ పరిధిలో శిక్షించాల్సిన అవ సరం ఉందని డిమాండ్ చేశారు.

ప్రపంచం నివ్వెరపోయేలా పోలీసులు, అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ఆవేదన వ్యక్తంచేశారు. కుమ్మెర ఘటనకు నిరసిస్తూ ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఈ జిల్లా వాసుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పసిపాప మరణంపై ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హత్యానేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, అంతటి కాశన్న, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.