7 March, 2026 | 8:52 AM

క్రికెట్ బెట్టింగ్ ఊబిలో ఫైనాన్స్ మేనేజర్

07-03-2026 02:01 AM
  1. కస్టమర్‌కు రూ.9.60 లక్షల టోకరా !

తాకట్టు బంగారం విడిపిస్తానని నమ్మించి సొంత ఖాతాలోకి నగదు బదిలీ 

మిర్యాలగూడ ఐఐఎఫ్‌ఎల్ బ్రాంచ్ మేనేజర్ యాదగిరి అరెస్ట్ 

రూ.4 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం 

హైదరాబాద్ , సిటీబ్యూరో మార్చి 06 (విజయక్రాంతి): క్రికెట్ బెట్టింగ్ వ్యసనంలో కస్టమర్‌ను బురిడీ కొట్టించి రూ. లక్షలు కాజేసీని  ఓ ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన లొడంగి యాదగిరి  రెండేళ్లుగా మిర్యాలగూడలోని ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

యాదగిరికి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్స్‌లో రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బును ఎలాగైనా కవర్ చేయాలనే అత్యాశతో.. తాను పనిచేస్తున్న సంస్థతో పాటు రుణాలు తీసుకునేందుకు, బంగారం విడిపించుకునేందుకు వచ్చే అమాయక కస్టమర్లను మోసం చేయడం మొదలుపెట్టాడు. 

ఈ క్రమంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మండల శంకర్ తాను గతంలో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు స్థానిక బంగారు వ్యాపారి మడూరి ఉపేంద్రచారితో కలిసి సదరు ఫైనాన్స్ సంస్థకు వెళ్లాడు. తాకట్టులో ఉన్న బంగారం విడిపించేందుకు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.9.60 లక్షలు కట్టాలని బ్రాంచ్ మేనేజర్ యాదగిరి లెక్కలు చెప్పాడు. దీంతో ఆ డబ్బులు చెల్లించేందుకు శంకర్ సిద్ధమయ్యాడు. 

 సంస్థ కరెంట్ అకౌంట్ పనిచేయడం లేదని..

శంకర్ డబ్బులు తీసుకుని రాగానే.. ఫైనాన్స్ సంస్థ కరెంట్ అకౌంట్ ప్రస్తుతం సర్వర్ ప్రాబ్లమ్ వల్ల పనిచేయడం లేదని మేనేజర్ యాదగిరి నమ్మబలికాడు. ఆ మొత్తాన్ని తన వ్యక్తిగత ఖాతాకు పంపిస్తే, మరుసటి రోజు ఉదయాన్నే కంపెనీ కరెంట్ అకౌంట్లో జమచేసి గోల్డ్ రిలీజ్ ప్రాసెస్ పూర్తి చేస్తానని శంకర్‌ను నమ్మించాడు. దీంతో  రూ.9.60 లక్షల మొత్తాన్ని యాదగిరి వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేశాడు. 

ఆ నగదును గోల్డ్ లోన్ ఖాతాకు జమ చేయకుండా, ఉద్దేశపూర్వకంగా పాస్వర్డ్ తప్పుగా నమోదు చేస్తూ తాకట్టు ఆభరణాలు ఇవ్వకుండా రోజుకో వాయిదా చెబుతూ కాలయాపన చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో యాదగిరిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద  నుంచి రూ.4 లక్షల నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  డీఎస్పీ వెల్లడించారు.