రెండేళ్లలో ఎస్‌ఎల్ బీసీ
- ప్రాజెక్టు పూర్తయితే 4.01 లక్షల ఎకరాలకు సాగునీరు
- 618 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీటి భరోసా
- కార్మికుల భద్రతకు రాజీపడం
- టన్నెల్, రిజర్వాయర్లు, కాలువల పనులు సమాంతరంగా పూర్తి
- మూడింతలు ఎక్కువగా సిబ్బంది.. ఆధునిక యంత్రాలతో శరవేగంగా పనులు
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): దక్షిణ తెలంగాణ రైతుల దశా బ్దాల కల అయిన ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఏఎంఆర్-ఎస్‌ఎల్బీసీ) ప్రాజెక్టును జూన్ నాటి కి తప్పకుండా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్ప ష్టం చేశారు. అదే సమయంలో టన్నెల్ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. సోమవారం సచివాలయంలో ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి..
ఈ ప్రాజెక్టు కేవలం ఇంజినీరింగ్ నిర్మాణం మాత్రమే కాదని, దక్షిణ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షకు రూపం ఇవ్వడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అవసరమైన నిధు లు, భూసేకరణ, సాంకేతిక అనుమతులు, పరిపాలనా అనుమతులను వేగంగా పూర్తి చేసి పనులు నిరంతరాయంగా సాగేందు కు అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. టన్నెల్‌తో పాటు డిండి ప్రాజెక్టు, బ్యాలెన్సింగ్ రిజర్వాయ ర్లు, కాలువల నిర్మాణాన్ని ఒకే సమగ్ర ప్రాజెక్టుగా భావించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ పనులు పునఃప్రారంభించిన తర్వాత ఇప్పటికే అర కిలోమీటర్‌కు పైగా పురోగతి నమోదైందని తెలిపారు. దేవరకొండ వైపు నుంచి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, శ్రీశైలం వైపు కూడా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు సాగుతున్నాయని చెప్పారు. టన్నెల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు మూడు అత్యాధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలు ముంబై పోర్టుకు చేరాయని, ఈ నెలాఖరులో పను ల ప్రదేశానికి చేరుకుని నిర్మాణ వేగాన్ని మరింత పెంచనున్నాయని వెల్లడించారు.
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని తరలించి 4.01 లక్షల ఎకరాలకు సాగునీరు, 618 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సురక్షిత తాగునీరు, అలాగే పారిశ్రామిక అవసరాలకు నీటి సర ఫరా అందుతుందని మంత్రి వివరించారు. ఈ ప్రా జెక్టుకు సవరించిన పరిపాలనా అనుమతి వ్యయం సుమారు రూ.12,718 కోట్లు అని తెలిపారు. పనుల వేగం ఎంత ముఖ్యమైనదైనా, కార్మికుల భద్రత దానికంటే ముఖ్యమని స్పష్టం చేశారు.
టన్నెల్ అంతటా తగిన లైటింగ్, సమర్థవంతమైన వెంటిలేషన్, సీనియర్ జియాలజిస్టులు, అథారిటీ ఇంజినీర్లు, నిపుణుల నిరంతర పర్యవేక్షణతో పనులు కొనసాగించాలని ఆదేశించారు. టన్నెల్ వద్ద పనిచేసే సిబ్బందిని ఇప్పటికే మూడింతలు పెంచినట్లు, అదనపు యంత్రాలు, ప్రత్యేక పరికరాలు, సాంకేతిక నిపుణులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. యంత్రాల రవాణా, కస్టమ్స్ అనుమతులు, సాంకేతిక సిబ్బంది నియామకం వంటి అంశాల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డిండి ప్రాజెక్టు, నక్కలగండి రిజర్వాయర్, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కాలువల నెట్వర్క్ పూర్తయితేనే ఎస్‌ఎల్బీసీ పూర్తి ప్రయోజనాలు రైతులకు అందుతాయని మంత్రి తెలిపారు. భూసేకరణ పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను జూన్ నాటికి అన్ని విధాలుగా పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టులు దక్షిణ తెలంగాణ రైతాంగానికి శాశ్వత సాగునీటి భరోసా, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించి ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తాయి అని అన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఇంజినీర్ (జనరల్) వీ.రమేష్ బాబు, ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.






