తక్కువ ప్రీమియంతో అధిక భద్రత.!
- బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
- ఎల్‌డీఎం చంద్రశేఖర్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ సంక్షేమ, సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను పొందాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) చంద్రశేఖర్ అన్నారు. నాగనూల్ గ్రామంలోని రైతు వేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థల సహకారంతో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పింఛన్ యోజన, నేషనల్ పెన్షన్ సిస్టమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. తక్కువ ప్రీమియంతో అధిక భద్రత అందించే ఈ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంపొందించుకోవడం నేటి అవసరమన్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ వంటి గోప్య సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. రైతుల కోసం అందుబాటులో ఉన్న కృషికా యాప్ ద్వారా పంట రుణాలను సులభంగా పొందవచ్చని, డిజిటల్ సేవల వినియోగంతో సమయం, శ్రమ ఆదా అవుతుందని వివరించారు.






