4 July, 2026 | 7:21 PM

"333 రోజుల దీక్షకు ఇదేనా ఫలితం..?

04-07-2026 06:17 PM

రామాయంపేట రెవిన్యూ డివిజన్ ఇంకా కాగితాలకే పరిమితం!"

 ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటం వద్దు..!

 హామీలు ఇచ్చి... అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనం..?

 రెవిన్యూ డివిజన్ వెంటనే అమలు చేయండి... లేదంటే ప్రజా ఉద్యమం తప్పదు..!

రామాయంపేట,(విజయక్రాంతి): "మా హక్కు – మా రెవిన్యూ డివిజన్" అంటూ 333 రోజుల పాటు ప్రజలు సాగించిన చారిత్రాత్మక నిరాహార దీక్షల ఫలితంగా ప్రకటించిన రెవిన్యూ డివిజన్ నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం రామాయంపేట ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన అన్యాయమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు గాలికొదిలేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రెండున్నర సంవత్సరాలు గడిచినా గెజిట్ నోటిఫికేషన్ జారీ కాకపోవడం, కార్యాలయాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. ఒకప్పుడు నియోజకవర్గంగా గుర్తింపు పొందిన రామాయంపేట, నేడు ప్రకటించిన రెవిన్యూ డివిజన్ కోసం కూడా ఎదురుచూడాల్సిన దుస్థితి రావడం పాలకుల వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీలిమిటేషన్ ప్రక్రియకు ముందు రెవిన్యూ డివిజన్‌ను వెంటనే అమలు చేయకపోతే రామాయంపేట భవిష్యత్తు మరోసారి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, యువత, మేధావులు, ఉద్యోగ సంఘాలు ఒక్కటై రామాయంపేట హక్కు కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు.