15-07-2025 12:00:00 AM
తిరుపతి, జూలై 14: తిరుపతి రైల్వే యార్డులోని హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి ఓ బోగి పూర్తిగా కాలిపోయింది. రాజస్థాన్‌లోని హిసార్ నుంచి బయలుదేరిన హిసార్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 11.50 (నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా)కి తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులను స్టేషన్‌లో దించేసిన తర్వాత యార్డులోకి వెళ్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి.
పక్క ట్రాక్‌పై ఉన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ జనరేటర్ బోగీలోకి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పే లోగా హిసార్ ఎక్స్‌ప్రెస్ బోగీ పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ జనరేటర్ బోగీ పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం వల్ల ఇతర రైలు సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదని రైల్వే అధికారులు తెలిపారు. హిసార్ స్పెషల్ రైలు బోగీ ఒకటి పూర్తిగా కాలిపోయినట్టు వెల్లడించారు.