ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు
- అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్
- ప్రయాణికులను కిందకు దింపేసిన సిబ్బంది
- నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి శివారులో ఘటన
చిట్యాల, మే 30 (విజయ క్రాంతి ): నల్లగొండ జిల్లాలోని జాతీయ రహదారి 65పై చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్ర మాదం సంభవించింది. హైదరాబాద్ నుం చి కాకినాడకు వెళ్తున్న రైయిన్‌బో ట్రావెల్స్ కు చెందిన బస్సు ఎన్ ఎల్ 07బీ0886లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు, మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పిది.
ఆ సమయంలో బస్సులో సుమా రు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.అందరూ సురక్షితంగా బయటపడగా, ప్రయాణికుల సామన్లు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంజిన్లో సాంకేతిక లోపం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు.






