31 May, 2026 | 12:41 AM

మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సెక్రటరీ ఆఫీస్ ముట్టడి

31-05-2026 12:02 AM
  1. ఈ పాఠశాల నాలుగో తరగతి ఉద్యోగులను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలి
  2. నాంపల్లిలోని మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో వెట్టి చాకిరి చేయిస్తారా..!
  3. రోజు లేబర్ కంటే తక్కువనా..! జీతమా..! ఃఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, మే 30 (విజయక్రాంతి): మైనార్టీ గురుకుల పాఠశాలలో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులను రోజు లేబర్ కంటే తక్కువ గా చూస్తున్నారని, వీరిని వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు శనివారం మైనారిటీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను కాంట్రాక్టు ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్ చేస్తూ  వందలాది మంది ఉద్యోగులు నాంపల్లిలోని మైనార్టీ గురుకుల విద్యాసంస్థ సెక్రటరీ కార్యాలయాన్ని ముట్టడించారు. సందర్భంగా ముట్టడి కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ రాష్ట్రంలోని 208 మైనార్టీ గురుకుల పాఠశాలలో పనిచేసే 1200 మంది కుక్, కామాటి, వాచ్మెన్, అటెండర్, స్వేపర్, పోస్ట్ లకు ప్రభుత్వ ఆర్డర్స్ లేకుండా రోజువారి కూలీలుగా లెక్కించి కూలీలుగా జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు.

వీరికి కేవలం 6 వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతర శాఖలలో ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్, బీసీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ విద్యాశాఖలో పనిచేసే నాలుగవ తరగతి ఉద్యోగులను కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకొని నెలనెలా సక్రమంగా జీతాలు ఇస్తున్నారని, కేవలం మైనారిటీ శాఖలో శ్రమదోపిడి చేస్తూ ఈ నాలుగవ తరగతి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆర్. కృష్ణయ్య విమర్శించారు.

ఈ ఉద్యోగులకు  ఈఎస్‌ఐ, ఈపీఎఫ్,  ఇన్సూరెన్స్ ఇతర సదుపాయాలు,  సెలవులు లేవు,  పిఆర్సి సదుపాయం లేదన్నారు. ఈ ఉద్యోగాలను ఇతర శాఖలలో మాదిరిగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతికి మార్చాలన్నారు. వేసవి సెలవులు ఇతర సెలవులకు జీతం ఇవ్వాలని, ప్రభుత్వం కల్పించే ఇతర సదుపాయాలు ఇవ్వాలని కోరారు. ఈ ముట్టడిలో కార్యక్రమంలో రాష్ట్ర బీసి యువజన సంఘం జల్లపల్లి అంజి, రాష్ట్ర బీసి విద్యార్ధి సంఘం అధ్యక్షులు పగిళ్ళ సతీష్, విద్యార్ధి సంఘం నాయకులు అభి గౌడ్ తో పాటు వందలాదిమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.