26 July, 2026 | 5:59 PM

అంతరిక్షంలోకి అగ్నిబాణ్

31-05-2024 12:43 AM

రాకెట్‌ను ప్రయోగించిన ప్రైవేట్ సంస్థ అగ్నికుల్

శ్రీహరికోటలో తొలి ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్

దేశీయం సాంకేతికతతో రాకెట్ నిర్మాణం

శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్), మే 30: అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయి దాటింది. ప్రైవేట్ సంస్థ రూపొందించిన అగ్నిబాణ్ రాకెట్‌ను గురువారం ఉదయం 7.15 గంటలకు విజయవంతంగా ప్రయోగించింది. తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను వీలైనంత వేగంతో, చౌకగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మద్రాస్ ఐఐటీ కేంద్రంగా పని చేసే అగ్నికుల్ సంస్థ అగ్నిబాణ్ పేర రూపొందించిన రాకెట్‌ను శ్రీహరి కోటలో తొలిసారి ఏర్పాటు చేసి ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్ ఏఎల్‌పీ నుంచి దీన్ని ప్రయోగించారు.

ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ ప్రక టించారు. అగ్నికుల్ సంస్థకు అభినందనలు తెలిపారు. నిజానికి ఈ ప్రయోగం ఎప్పుడో జరగాల్సింది. కానీ, కొన్ని కారణాలతో నెలన్న ర రోజుల్లో నాలుగు సార్లు వాయిదా పడింది. ఐదోసారి చేసిన ప్రయోగంలో విజయం సాధించింది. 

దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో..

ఈ రాకెట్‌లో తొలిసారి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ లిక్విడ్ ఫ్లుటైను ఉపయోగించారు. ఈ ప్రయోగం రెండు నిమిషాల పాటు సింగిల్ స్టేజ్‌లోనే జరిగినట్లు ఇస్రో వెల్లడించింది. ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ త్రీడీ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను అమర్చారు. దీన్ని అగ్నికుల్ కాస్మోస్ రూపొందించింది. ఈ విధానంపై ఆ సంస్థకు పేటెంట్ కూడా ఉండటం విశేషం.

ఇది మెడికల్ గ్రేడ్ సబ్ కూల్డ్ లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ ఆధారంగా ఒక స్టేజ్‌లోనే పనిచేస్తుంది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేయడం గమనార్హం. అగ్నిబాణ్ రాకెట్ పొ డువు 6.2 మీటర్లు . బరువు 575 కిలోలు. ఈ రాకెట్‌లో తొలిసారి ఈథర్‌నెట్ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్ వ్యవస్థను వాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోపైలట్ కంట్రోల్ వ్యవస్థను ఉపయోగించారు. ప్రయో విఫలమైతే తక్షణమే నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లుటై టర్మినేషన్ సిస్టం అమర్చారు. అంతేకాకుండా వివిధ రకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా తీర్చి దిద్దారు. 

రెండు నిమిషాల్లోనే...

మొత్తం ప్రయోగం దాదాపు రెండు నిమిషాల పాటు జరిగింది. ప్రయోగం ముగిశాక బంగాళాఖాతంలో రాకెట్ కూలిపోయింది. ప్రయోగం తర్వాత 1.29 నిమిషాలకు ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరి అక్కడి నుంచి వెనుదిరిగి సముద్రంలో పడింది. ఈ రాకెట్ ఇంజిన్, ఆకారం, పరిమాణం తదితర అంశాలను విశ్లేషించి మరింత మెరుగుపరచడానికి ఈ ప్రయోగం ఉపయోగపడ నుంది. సాధారణంగా ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాల బరువు అధికంగా ఉంటుంది. 30 నుంచి 300 కేజీల బరువు ఉన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఈ అగ్నికుల్  రాకెట్ సరిపోతుంది. 

మోదీ ప్రశంసలు..

అగ్నిబాణ్ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన ఆయన.. దేశం మొత్తం గర్వపడే విధంగా గొప్ప విజయాన్ని సాధించారు. ప్రపంచంలో తొలి సింగిల్ పీస్ త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌తో నిర్మించిన రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. భారత అంతరిక్ష రంగంలో ఈ క్షణం ఎంతో విలువైనది. ఇది మన యువత శక్తిని ప్రపంచానికి చాటుతుంది. అగ్నికుల్ కాస్మోస్ బృందానికి శుభాకాంక్షలు. వారు మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి రాజీవ్‌చంద్రశేఖర్ కూడా అగ్నికుల్ సంస్థను అభినందించారు. తొలి త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌ను భారత్ రూపొందించడం విశేషమన్నారు.