calender_icon.png 10 January, 2026 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయాలి

07-01-2026 12:53:04 AM

ములకలపల్లి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసి తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  మాట్లాడుతూ అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గం ప్రధానంగా గిరిజన ప్రాంతంగా ఉండి అడవులు, పరిశ్రమలు, నివాస ప్రాంతాలు విస్తృతంగా ఉన్నాయని తెలిపారు.

ఈ ప్రాంతంలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్వంచలో మాత్రమే ఉందని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పాల్వంచ నుండి అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకునేలోపు విలువైన సమయం వృథా అవుతుండటంతో భారీ ఆస్తి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ములకలపల్లి మండల పరిధిలో గిరిజన గ్రామాలు, అటవీ ప్రాంతాలు, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు ఉండటంతో అగ్నిప్రమాదాల నివారణకు తక్షణ స్పందన అత్యంత అవసరమని తెలిపారు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ములకలపల్లి మండలంలో ఒక అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసి ఏర్పాటు చేస్తే అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎంతో భద్రత కలుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ వినతిని సానుకూలంగా పరిశీలిస్తామని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి  హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.