calender_icon.png 9 January, 2026 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

07-01-2026 12:51:52 AM

  1. నెల రోజుల్లో 280 ఇండ్లు ప్రారంభానికి సిద్దం చేయాలి
  2. ప్రతి ఎంపీడీఓ రోజూ పది ఇండ్ల పురోగతిని పరిశీలించాలి, లబ్దిదారులతో సమావేశం కావాలి
  3. కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, జనవరి 6(విజయ క్రాంతి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై హౌసింగ్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఏఈలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఇంచార్జి కలెక్టర్ సమావేశమయ్యారు.ముందుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మండలాల వారిగా సమీక్ష చేశారు. జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం 7,408 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని వెల్లడించారు.

5,571 ముగ్గు పోశామని, 4,544 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో, 3,193 ఇండ్లు గోడల లెవెల్ లో, 2,370 స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ వెల్లడించారు. ముగ్గు పోసిన వారితో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ప్రతి ఎంపీడీఓ ప్రతి రోజూ పది ఇండ్ల పురోగతిని పరిశీలించాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. తాను ఏదో ఒక మండలంలో ఆకస్మిక తనిఖీ చేస్తానని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా.. సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు.

మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారి వివరాలు, ఫోన్ నంబర్లు అందుబాటులో పెట్టి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. లబ్దిదారుల నుంచి ఇంటి నిర్మాణ పనుల అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పనులు వినియోగించుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించిందని,  సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఎంపీడీఓలు ఆదేశించారు.

పురోగతిలో ఉన్న ఇండ్ల ఫోటోలు ఎప్పటికప్పుడు హౌసింగ్ ఏఈలు ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలని, లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి డబ్బు జమ అవుతున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లపై వచ్చిన దరఖాస్తులను ఆయా ఎంపీడీఓలు పరిష్కరించాలని ఆదేశించారు.

అధికారులకు అభినందన

బోయినపల్లి మండలంలో 23 ఇందిరమ్మ ఇండ్లు, తంగళ్ళపల్లి మండలంలో 14 పూర్తి చేసిన ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులను అభినందించారు. మిగితా మండలాల వారు ప్రణాళిక ప్రకారం ఇండ్లను పూర్తి చేయించాలని సూచించారు.

పూర్తి అయిన ఇండ్లను గృహ ప్రవేశానికి సిద్దం చేయాలని పిలుపు నిచ్చారు. రానున్న నెల రోజుల్లో జిల్లాలో మొత్తం 280 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్, మండల ప్రత్యేక అధికారులు గీత, అఫ్జల్ బేగం, లక్ష్మీరాజం, రవీందర్ రెడ్డి, హనుమంతు, షరీఫుద్దిన్, రామకృష్ణ, క్రాంతి, నజీర్ అహ్మద్, ఎంపీడీఓలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.