27 June, 2026 | 11:29 PM

మెగా డీఎస్సీపై తొలి సంతకం

14-06-2024 12:40 AM

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 

  1. తొలి రోజు మొత్తం ఐదు ఫైళ్లపై సంతకాలు 
  2. తెలుగు జాతికి పెద్దన్నలా ఉంటానని వెల్లడి
  3. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
  4. సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు 

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ సచివాల యంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం లోని మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేద పండితల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్శంగా  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,347 పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్  యాక్ట్‌ను రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు.

సామాజిక పింఛన్లు రూ. 4 వేలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు వరుసగా సంతకాలు చేశారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు. 

ఏపీని పేదరికం లేని రాష్టంగా తీర్చి దిద్దుతా 

పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సంపద సృష్టించి పేదలకు చేర్చేలా  తన పాలన ఉంటుందన్నారు. తెలుగు జాతికి తాను పెద్దన్నలా ఉంటానని పేర్కొన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతాని అన్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేమయని, ఏపీని పేదరికం లేదని రాష్ట్రంగా మార్చాలన్నారు. గతంలో 2020 ప్రణాళికతో ముందుకు వెళ్లామని, ఇప్పుడు 2040 ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అన్నారు.  ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని, అలిపిరి వద్ద క్లుమైర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని, తనను వెంకటేశ్వరస్వామియే కాపాడారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది ఉందని గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారని తెలిపారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని తెలిపారు. కుటుంబ వ్యవస్థ మనకు పెద్ద సంపదని, ఎనర్జీని రీఛార్జ్ చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే భాగస్వాములు ఉంటారని తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 

నేరస్థులను సహించేది లేదు

గత ఐదేళ్లు ప్రజలు భయపడిపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా మార్చారని, శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.  రాజకీయ పార్టీలు, ప్రజలు, నేతలతో పాటు మీడియా ప్రతినిధులు  కూడా క్షోభ అనుభవించారని అన్నారు. పరదాలు, చెట్లు కొట్టడంలాంటివి ఇక ఉండవన్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయినంత వరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రక్షాళన చేసి, సరికొత్త పాలన ప్రారంభించామన్నారు. తిరుపతి వెంకన్న ఆశీస్సులతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశామన్నారు. ఇతరులపై తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగదన్నారు. అయితే తప్పులు చేస్తే మాత్రం  సహించేది లేదని హెచ్చరించారు. 

ఏపీలో ప్రజాపాలన ప్రారంభమైంది.. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి ప్రజా పాలన ప్రారంభమైందని, ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.ప్రసాదాలు,  తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.  రాష్ట్ర  ప్రజలందరికీ మంచి చేయడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా మమేకం కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన, ఇబ్బందులు పడిన వర్గాలను పునరుద్దరించాలన్నారు.  రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయని, వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.