calender_icon.png 18 July, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల ఉత్పత్తిలో తెలంగాణను అగ్ర గ్రామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం

17-07-2025 11:23:12 PM

ప్రతి నియోజకవర్గానికి ఒక యూత్ సర్వీసెస్ కేంద్రం ఏర్పాటు చేస్తాం 

 ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను ప్రజలకు చేరువ చేయాలి

పలువురి అధికారులపై అసహనం, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి షోకాజ్ నోటీసు 

జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి : దిశా కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవి

రాష్ట్ర పశుసంవర్ధక యువజన క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి

వనపర్తి,(విజయక్రాంతి): చేపల ఉత్పత్తిలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశా కమిటీ చైర్మన్ మల్లురవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దిశ కమిటీ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చేపల ఉత్పత్తిలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, పదేళ్లలో దాదాపు రూ.80 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో 82 కోట్ల చేప పిల్లలను వదలబోతున్నామని, ఆ తర్వాత వాటి ఉత్పత్తి చేసి కోల్డ్ స్టోరేజ్ లోను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ప్రతి నియోజకవర్గానికి రెండు ఎకరాల స్థలంలో ఒక యూత్ సర్వీసెస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక క్రీడల విషయంలో కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఇందుకోసం రూ.750 కోట్ల బడ్జెట్ను కేటాయించిందని చెప్పారు. జిల్లాలో చేపల ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేక చేపల పెంపకం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రైతుల నుంచి సన్నబియ్యాన్ని బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి అవే సన్నబియ్యాన్ని వారే తినేలా  పంపిణీ చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పనిచేయాలని, బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. ఇక వనపర్తి నియోజకవర్గానికి క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మినీ స్టేడియాలు, స్పోర్ట్స్ పాఠశాలలు కేటాయించాలని శాసనసభ్యులు మేఘారెడ్డి మంత్రిని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గంలో కడుకుంట్ల, చందాపూర్ రంగాపూర్ తాటిపాముల గ్రామాల్లో పశు ధావకానాల ఏర్పాటుకు ఎమ్మెల్యే మంత్రిని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. జిల్లాలో గొర్రెలకు నట్టల నివారణపై దృష్టి సాధించాలని జిల్లా పశుసంవర్ధక అధికారికి సూచించారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన జీవాల విషయంలోనూ రైతులకు వేగంగా పరిహారం అందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను ప్రజలకు చేరువ చేయాలి... దిశా కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు అయిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, తో పాటుగా అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజలందరికీ చేరువ చేసే విధంగా బ్యాంకర్లు పనిచేయాలని దిశా కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో బ్యాంకులు సఫలీకృతమయ్యాయని, రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. మరి ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకర్లు వీటిపై దృష్టి సాధించడం లేదని ఈ ఆయా పథకాలను ఖాతాదారులందరికీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తపాలా శాఖకు సంబంధించి భీమా పథకాలు అమలు చేయడంలో వెనుకబడ్డారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు బ్యాంకర్లు ఈ పథకాలను ప్రజలకు చేరువచేసి సోషల్ రెస్పాన్సిబిలిటీని కనబరచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల కు సంబంధించి రుణాలను గ్రౌండ్ చేయడంలో వేగం పెంచాలన్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న యూనిట్లను గ్రౌండింగ్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక పీఎం ఈజిపి పథకానికికి సంబంధించి యూనిట్లను గ్రౌండింగ్ చేయడంలో జిల్లా పరిశ్రమల శాఖ పనితీరు బాగుందని, కె వి ఐ బి, కె వి ఐ సి విభాగాలు మంచి పనితీరు కనబరచలేదని అసహనం వ్యక్తం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే విధంగా పనిచేయాలని సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశించారు.

అదేవిధంగా అన్ని బ్యాంకుల వద్ద ఎం ఎస్ ఎం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన లిస్టులను ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ఉపాధి మార్గాలను చూపించాలని సూచించారు.  ఇక జిల్లా పరిషత్ కు సంబంధించి 2021-22 జిల్లా పరిషత్ ప్రత్యేక నిధుల్లో భాగంగా పెండింగ్లో ఉన్న 11 పనులను ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే కలెక్టర్ కు తెలియజేయాలని సూచించారు. ఇవే కాకుండా నీటిపారుదల శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

కాన్ చెరువు కాలువకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను కూడా వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్ల భర్తీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎంపీ లాడ్స్ నిధుల్లో భాగంగా పెండింగ్లో ఉన్న నాలుగు పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని సూచనలు చేశారు.  వైద్య శాఖకు సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఎంపి ఆరా తీశారు. మిషన్ మధుమేహ కార్యక్రమం గురించి తెలుసుకున్న ఎంపీ ప్రజలకు మధుమేహ పరీక్షలు చేసిన తర్వాత జీవన శైలిలో మార్పులను చెప్పడమే కాకుండా, మందులను కూడా సరఫరా చేయాలని సూచించారు. 

వనపర్తి లోని నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ త్వరగా అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ అధికారికి సూచించారు. జిల్లాలో అప్లై చేసుకున్న వారందరికీ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి అర్హులై ఉండి ఇంకా 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు పొందని వారి వివరాలు తీసుకొని వారందరికీ లబ్ధి చేకూరే విధంగా అధికారులతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే శంకుస్థాపన నోచుకొని ఇంకా పెండింగ్లో ఉన్న సబ్ స్టేషన్లను వేగంగా పూర్తి చేసి ప్రారంభించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. ఇక వ్యవసాయ శాఖ తరపున అర్హులై ఉండి ఇంకా రెండు లక్షల రూపాయల రుణమాఫీ పొందని వారు ఎవరైనా ఉంటే వారికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లో విద్యార్థులను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో ఎంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని ఆరా తీసిన ఎంపీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల నివేదికను సమర్పించాలని సూచించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మెఘా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో అధికారులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 పలువురి అధికారులపై అసహనం, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి షోకాజ్ నోటీసులు 

దిశ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, జి జి హెచ్ సూపరిండెంట్ సమావేశానికి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా భూగర్భ జల శాఖ అధికారి సమావేశానికి హాజరు కాకపోవవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తు ఎంపీ షోకాస్ నోటీసులు జారీ చేయమని కలెక్టర్ కు సూచించారు.