రంజాన్ మాసంలో ముస్లింల పవిత్ర విధి ‘ఫిత్రా దానం’
-మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా
పాల్వంచ,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ముస్లిం తమ కుటుంబ సభ్యులందరి పేరుమీద పేదలకు అందించే ఒక ముఖ్యమైన దానమే ఫిత్రా అని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఫిత్రా అనగా ఉపవాసం ముగిసిన సందర్భంగా చేసే దానం అని తెలిపారు. ఈదుల్ ఫితర్ నమాజ్ ఆచరించడానికి ముందుగానే ఈ ఫిత్రా దానాన్ని తమ కుటుంబంలో ఉన్న పేద బంధువులకు, తమ వీధిలోని పేద ముస్లింలకు లేదా తమ ప్రాంతంలోని మదర్సాలకు అందజేయాలని ఆయన సూచించారు. ఫిత్రా దానానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉపవాసం పాటించే సమయంలో తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పుల నుండి విముక్తి పొందడం. పేదలకు ఆహారం అందించి వారు కూడా ఆకలి బాధ లేకుండా ఈద్ పండుగను ఆనందంగా జరుపుకునేలా చేయడం.
ఫిత్రాను “జకాత్ అల్ ఫిత్ర్” అని కూడా పిలుస్తారని ఆయన చెప్పారు. కాబట్టి ముస్లిం సోదరులు తమ ప్రాంతాల్లో కనిష్టంగా ఒక్కొక్క వ్యక్తికి ₹120 చొప్పున, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడి పేరుమీద లెక్కకట్టి ఫిత్రా దానం చేయాలని సూచించారు. లేనియెడల రంజాన్ మాసంలో నిర్వహించిన ఉపవాసాలు మరియు ఈద్ పండుగ రోజున ఈద్గాలో ఆచరించే ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ పూర్తి ఫలితాన్ని ఇవ్వవని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ముస్లిం సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 21వ తేదీ (శనివారం) జరగనున్న రంజాన్ పండుగకు ముందుగానే తమ ఫిత్రాలను నిరుపేదలకు లేదా సమీపంలోని మదర్సాలకు అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




