25 May, 2026 | 10:26 PM

హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్

25-05-2026 09:47 PM

కారు, బైకు, కత్తి, ఐదు సెల్ ఫోన్ లు స్వాధీనం.

వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ

 సూర్యాపేట, మే 25 (విజయక్రాంతి): ఈనెల 23వ తేదీన జిల్లాలోని సూర్యాపేట మండలం యార్కారం గ్రామంలో జరిగిన హత్య కేసు కు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన ఘటన సోమవారం జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం యర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు 2007 సంవత్సరంలో ఏర్కారం గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడన్నారు. ఈ విషయంలో ప్రతీకారం పెంచుకున్న రవీందర్ కుమారుడు మిద్దే జీవన్ ఈ హత్యకు పథకం పన్నాడన్నారు.

దీనిలో భాగంగా ఈనెల 22 శుక్రవారం మధ్యాహ్నం తాళ్లగడ్డ ప్రాంతంలో ఎ2 సైదులు నివాసముంటున్న ఇంటి నుండి చేపలు, మందు తెచ్చాము దావత్ చేసుకుందామని సైదులు, ప్రసాద్ లు మధుకి ఫోన్ చేసి పిలవడం జరిగిందన్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మధు కిరాయి ఇంటి వద్దకు రాగా ఈ విషయాన్ని  జీవన్ కు సైదులు ఫోన్ చేసి తెలియజేసి మందు పంపమని చెప్పాడన్నారు. దీంతో జీవన్ ఏ6 నిందితుడు భరత్ ద్వారా రెండు సార్లు మందు పంపించాడన్నారు. అయితే 7:30 గంటల సమయంలో మధు మద్యం మత్తులో ఉండగా సమాచారం అందించాదన్నారు.

ఇదే అదునుగా చూసుకొని జీవన్, ఆనంద్ లు ఇద్దరు కారులో మధు ఉన్న ఇంటిలోకి వెళ్లారన్నారు. ఆ సమయంలో ప్రసాద్ మధు కాళ్లు చేతులు పట్టుకోగా అప్పటికే సిద్ధంగా పెట్టుకున్న మటన్ కొట్టే కత్తితో సైదులు మధు పై దాడి చేసినట్లు తెలిపారు. తదుపరి కత్తిని జీవన్ తీసుకుని మధు మెడ, మొహం, భుజంపై తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడన్నారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి కారులో వేసుకొని వెళ్లి యర్కారం శివారులో కల్వర్టు కింద పడేశారన్నారు. తదుపరి నిందితులు అక్కడి నుండి పారిపోయారన్నారు. కాగా నమ్మదగిన సమాచారం మేరకు ఇప్పుడే ఏ1 జీవన్,  ఏ4 ఆనంద్ లను అదుపులోకి తీసుకొని విచారించగా వారిచ్చిన సమాచారం మేరకు ఏ2 సైదులు, ఏ3 ప్రసాదు , ఏ6 భరత్ ముగ్గురు నిందితులను సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈనాడు ఆఫీస్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వీరి నుండి ఒక కారు, బైకు, కత్తి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కాగా ఏ5 నిందితురాలు భవాని పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గతంలోనే మధుపై రెండుసార్లు హత్యాయత్నం చేసి విఫలమైనట్లు తెలిపారు. ఈ కేసులో బాగా పనిచేసిన సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, పట్టణ సిఐ వెంకటయ్య, రూరల్ సిఐ రాజశేఖర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్సైలు ఏడుకొండలు, శివతేజ, మహేందర్ నాథ్, రూరల్ ఎస్సై బాలు నాయక్,  స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందిని, టెక్నికల్ టీంను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.