25 May, 2026 | 10:50 PM

టీడీఆర్ ద్వారా బాధితులకు న్యాయం చేయాలి

25-05-2026 09:45 PM

- బిఆర్ఎస్ నాయకులు ఎన్‌సీ సంతోష్

గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కోటమైసమ్మ రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన బాధితులకు టీడీఆర్ ద్వారా న్యాయం చేయాలని బిఆర్ఎస్ నాయకులు ఎన్‌సీ సంతోష్ అన్నారు. గజ్వేల్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీ సంతోష్ మాట్లాడుతూ గజ్వేల్‌లోని కోట మైసమ్మ నుంచి ఇందిరా పార్కు వరకు, పిడిచెడ్ రోడ్డులో రోడ్డు విస్తరణ కారణంగా స్థలాలు, ఇండ్లు కోల్పోయిన బాధితులకు తాను అండగా ఉంటానన్నారు. ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) జీవో బాధిత కుటుంబాలకు ఒక వరమన్నారు.

అధికారులు టీడీఆర్ స్కీమ్‌ను సమర్థంగా అమలు చేస్తే దాదాపు 250 కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు బాధితుల పక్షాన నిలవాలని కోరారు. గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి హయాంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని హెచ్‌ఎండీఏలో విలీనం చేయలేదని, అందువల్ల అప్పట్లో టీడీఆర్ ద్వారా సరైన నష్టపరిహారం అందించలేకపోయామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీడీఆర్ జీవో అమలు చేసినా, ప్రజలకు చేరువ చేసింది మాత్రం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. స్థలాలు, ఇండ్లు కోల్పోయిన వారికి అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా సహకరించి టీడీఆర్ ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌సీ సంతోష్ డిమాండ్ చేశారు.