సంగారెడ్డి బైపాస్ రోడ్డులో ఐదు జంక్షన్ల ఏర్పాటు
ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దండి..
హెచ్‌ఎండీఏ అధికారులకు సూచనలు చేసిన జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఏప్రిల్ 12 : సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ విస్తరణ పనులు వేగవంతం అవుతున్నాయి. రూ.13 కోట్లతో చేపడుతున్న ఈ బైపాస్ రోడ్డులో ఐదు చోట్ల జంక్షన్ లు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో ఐబి గెస్ట్ హౌస్ మొదలుకుని బసవేశ్వర చౌక్ వరకు ఐదు చోట్ల జంక్షన్ లు ఏర్పాటు కానున్నాయి. హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి జంక్షన్లు ఏర్పాటయ్యే ఐబి చౌరస్తా, ఆర్డీవో క్యాంప్ ఆఫీస్ చౌరస్తాను పరిశీలించారు.
జంక్షన్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, జంక్షన్లలో సుందరీకరణ పనులు చేయాలని, జంక్షన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని హెచ్‌ఎండీఏ అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా జంక్షన్ల డిజైన్ లు ఉండాలని, కన్సల్టెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. జంక్షన్ లు ఏర్పాటు విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి కావాలని అధికారులకు జగ్గారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, హెచ్‌ఎండీఏ ఇంజనీర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.




