ఇంటర్ ఫలితాల్లో ఎస్వీజేసీ విజయదుందుభి
- అత్యధిక ఉత్తీర్ణతతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా
ఊట్కూరి మహేందర్ రెడ్డి
కరీంనగర్ క్రైం, ఏప్రిల్12(విజయక్రాంతి):తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్వీజేసీ విద్యాసంస్థలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. స్టేట్ లెవల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడంతో పాటు, అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేసిన ఏకైక కళాశాలగా నిలిచామని ప్రైవేట్ విద్యాసంస్థల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, కళాశాల సెక్రటరీ ఊట్కూరి మహేందర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఒకటి రెండు ర్యాంకులు సాధించడం కంటే, చేరిన ప్రతి విద్యార్థిని ఉత్తీర్ణులని చేసి వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా కార్పొరేట్ సంస్థలకు దీటుగా సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలు సాధిస్తున్నామన్నారు. నిష్ణాతులైన అధ్యాపక బృందం, యాజమాన్య నిబద్ధత, విద్యార్థుల క్రమశిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.
ప్రతిభాపాటవాలు ఇవే..
ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో 994, 992, 992, 991, 991 మార్కులు సాధించి విద్యార్థులు సత్తా చాటారు. అలాగే ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 468, 467, 466, 465(ముగ్గురు), 464(ఇద్దరు) మార్కులు సాధించగా.. బైపీసీలో 435, 434, 432 మార్కులు, సీఈసీలో 490, 489, 486 మార్కులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు కాంతాల రామ్ రెడ్డి, మేడ వెంకట వరప్రసాద్, సింహాచల హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.




