లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడి దుర్మరణం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డిగూడలో బుధవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదో అంతస్తులో నివాసం ఉంటున్న నరుసు నాయుడు చిన్న కుమారుడు హర్షవర్ధన్(5) బుధవారం సాయంత్రం ఆడుకుంటూ లిఫ్ట్ ఎక్కి ఐదో అంతస్తులోకి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి కిందకు దిగుతున్న క్రమంలో సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ 4వ, 5వ అంతస్తుల మధ్య ఆగిపోయింది.
ఈ క్రమంలో బాలుడు లిఫ్ట్ డోర్ల మధ్య ఇరుక్కుపోయాడు. చిన్నారి ఆర్తనాదాలు విన్న కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకుని, ఎంతో శ్రమించి బాలుడిని బయటకు తీశారు. అయితే, అప్పటికే ఆ చిన్నారి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు.






