డబ్బు డబుల్
ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో సాధ్యమేనా?
మీరు రిస్క్ తీసుకోకుండా మీ పొదుపును పెంచుకోవాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) ఒక సురక్షిత మార్గం. చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా మీరు టెర్మ్ డిపాజిట్ చేస్తే, దాని కాలపరిమితి ముగిసే వరకూ ఎటువంటి ఒత్తిడి ఉండదు. మీ పొదుపు సురక్షితంగా ఉంటుంది. అంతే కాకుండా 6 శాతం చొప్పున వార్షిక రాబడినీ ఇస్తుంది. పలువురు వారి పెట్టుబడికి భద్రతతో పాటు పొదుపు 100 శాతం (రెట్టింపు) పెరగాలని ఆశిస్తారు. కానీ అన్ని ఎఫ్‌డీలకు ఒకే విధమైన వడ్డీ రేట్లు ఉండవు.
స్వల్పకాలిక డిపాజిట్లపై తక్కువ వడ్డీ, దీర్ఘకాలిక టెర్మ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వస్తుంది. అలాగే బ్యాంక్‌కూ, బ్యాంక్‌కూ రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. పలు బ్యాంక్‌లు గరిష్ఠంగా 10 ఏండ్ల కాలపరిమితిగల ఎఫ్‌డీలను ఆఫర్ చేస్తున్నాయి. మరి ఈ గరిష్ఠ కాలపరిమితిలో మీ డబ్బు డబుల్ అవ్వాలంటే వడ్డీ రేటు 7.18 శాతం, ఆపైన ఉంటేనే సాధ్యం. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ బ్యాంక్‌ల ఎఫ్‌డీలను పరిశీలిద్దాం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 10 ఏండ్ల డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఇది 7.18 శాతంకంటే ఎక్కువగానే ఉన్నందున పెట్టుబడి పదేండ్లలో రెట్టింపవుతుంది. మీరు రూ.1 లక్ష మదుపు చేస్తే దశాబ్దకాలంలో రూ.2.06 లక్షలు అవుతుంది. మరోవైపు సాధారణ పౌరులకు ఇచ్చే వార్షిక వడ్డీ రేటు 7 శాతమే అయినందున, పదేండ్లలో వారి పెట్టుబడి రెట్టింపుకాదు. రూ.లక్ష మదుపునకు రూ.1.96 లక్షలే వస్తాయి.
ఐసీఐసీఐ బ్యాంక్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తరహాలోనే ఐసీఐసీఐ బ్యాంక్ సైతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నది. దీనిలో కూడా సీనియర్ సిటిజన్ అకౌంట్‌తో మదుపు చేస్తేనే పదేండ్లలో రెట్టింపు అవుతుంది. రూ. 1 లక్ష పెట్టుబడి సీనియర్ సిటిజన్లకైతే రూ.2.06 లక్షలకు, సాధారణ పౌరులకైతే రూ.1.96 లక్షలకు పెరుగుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.5 శాతం వార్షిక రాబడిని ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వార్షిక రాబడిని అందిస్తున్నది. అంటే సాధారణ పౌరులు చేసే రూ.1 లక్ష ఎఫ్‌డీ పదేండ్లలో రూ.1.87 లక్షలకు పెరుగుతుంది. అదే సీనియర్ సిటిజన్ల రూ.1 లక్ష ఎఫ్‌డీ 10 సంవత్సరాల్లో రెట్టింపునకు పైగా రూ.2.06 లక్షలు అవుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: పదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ సిటిజన్లకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఈ రేట్ల ప్రకారం సాధారణ పౌరులు చేసే రూ.1 లక్ష ఎఫ్‌డీ పదేండ్లలో రూ.1.87 లక్షలకు పెరుగుతుంది. అదే సీనియర్ సిటిజన్ల రూ.1 లక్ష ఎఫ్‌డీ 10 సంవత్సరాల్లో రెట్టింపునకు పైగా రూ.2.06 లక్షలు అవుతుంది.






