29 July, 2026 | 2:14 AM

‘హస్తం’లో అతిస్వేచ్ఛా చిచ్చు!

29-07-2026 01:32 AM
  1. కాంగ్రెస్‌లో ఒకరిపై మరొకరు బాహటంగానే విమర్శలు
  2. జిల్లాల్లో గ్రూప్‌లుగా విడిపోతున్న నాయకులు
  3. పార్టీకి, ప్రభుత్వానికి నష్టంచేసేలా వ్యవహారం
  4. విపక్షాలకు అస్త్రాలుగా మారుతుందున్న ఆందోళన  
  5. అధిష్ఠానం కట్టడి చేయాలని కోరుతున్న క్యాడర్

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): హస్తం పార్టీలో స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఈ అతి స్వేచ్ఛ చిచ్చు పెడుతోందని, దీన్ని కట్టడి చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పార్టీ క్యాడర్ ఆందోళన వ్యక్తంచేస్తున్నది. పార్టీ నాయకుల మీతిమీరిన స్వేచ్ఛ వల్ల సంస్థాగతంగా, రాజకీయం గా నష్టం కలుగుతుందని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. పార్టీ పరిస్థితి పూటకో పంచాయితీ, రోజుకో లొల్లీగా మారింది.

ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాల్సిందిపోయి.. సొంత పార్టీ నాయకులే గ్రూప్‌లుగా విడిపోయి ఒకరినొకరు తిట్టుకోవడమేంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు, పంచాయితీలతోపాటు ఒకరిపై ఒకరి విమర్శలకు పార్టీ అధిష్ఠానం కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతోంది. ఇటు రాష్ట్రస్థాయిలో, అటు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నేతల నోర్లు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమా దం ఉందని పార్టీ క్యాడర్ అందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గాల మధ్య మొదలైన పంచాయితీ, ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఎమ్మెల్యే మందులు సామేల్  ఏకంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌పైన విమర్శల జోరు పెంచడం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంతే స్థాయిలో స్పందించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా హాట్ టాఫిక్‌గా మారింది.

ఇలాంటి పరిస్థితి ఒక తుంగతుర్తి నియోజకవర్గానికే పరిమితం కాలేదని, రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సఖ్యత లేకుండా పోయిందని చెబుతున్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీలు కొనసాగుతున్నాయి. ఇక పార్టీ కమిటీల్లో మహిళలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీతారావు నేతృత్వంలో ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఛాంబర్ ఎదుట ఇటీవలనే ఆందోళన చేపట్టడం పార్టీలో కలకలం రేపింది.

పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ పైనే ఆరోపణలు చేయడం, తనవారికి మాత్రమే పదవులు ఇచ్చుకుంటున్నారని బహిరంగంగా ఆరోపించారు. పేరు చివరన గౌడ్ లేదా రెడ్డి ఉంటేనే పదవులు వస్తాయా అంటూ సునీతారావు ప్రశ్నించడంపై కాంగ్రెస్‌లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది పార్టీ వ్యతిరేక కార్యకలాపంతోపాటు ప్రతిపక్షానికి ఒక అస్త్రం ఇచ్చినట్టు అయిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి నెలకొన్నది.

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి వర్గాల మధ్య మొదటి నుంచి వైరం కొనసాగుతోంది. అంతేకాదు పార్టీ అధిష్ఠానానికి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ నాయకత్వం చూసీ చూడనట్టు వదిలేయడం వల్లే అందరికీ చులకనైపోయామన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపైన కఠినంగా వ్యవహరిస్తేనే నాయకులు కంట్రోల్‌లో ఉంటారని, ఆ కోణంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయాలు ఉండాలని కోరుతున్నారు.

కొందరు మాట్లాడితే షోకాజ్ నోటీసులు, పార్టీ నుంచి గెంటివేతలు ఉంటున్నాయని, కానీ మరికొందరు ఏం మాట్లాడినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని అభిప్రాయం బలంగా ఉంది. పీసీసీ చేస్తున్న పెద్ద పొరపాటు ఇదేనంటూ సీనియర్లు మండిపడుతున్నారు. 

గాంధీభవన్‌లో ధర్నా ఒకటే కాదు.. అంతకు ముందు మంత్రివర్గ విస్తరణ అంశంలో కూడా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడారు. అది చినికి చినికి గాలి వానలా మారి ప్రతిపక్షానికి ఒక ఆయుధం ఇచ్చినట్టుగా అవుతుందని అంటున్నారు. పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీగా, ప్రభుత్వంగా పాలసీ పరమైన నిర్ణయాలపై లీకులిచ్చేవారిపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. విపక్షాలకు రాజకీయ అస్త్రాలు అందించే నేతలపై కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.